తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు

తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హెచ్చరించారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు ఉద్యమస్థాయిలో భాషావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొంటూ మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని సూచించారు. ఆంగ్లం మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని హితవు చెప్పారు.

‘‘కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే ఆ భాష, సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చైతన్యవంతమైన తెలుగు సమాజం తమ సుదీర్ఘ చరిత్రలో నేటి వరకు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు భాషలో దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేసుకుంటూ మనుగడ కొనసాగించగలుగుతోంది” అని తెలిపారు. 

“సంక్లిష్ట వచనా ప్రక్రియ నుంచి సరళమైన ప్రక్రియలోకి మహాప్రస్థానం సాగింది. ఈ ప్రస్థానంలో ముందు చూపుతో, తగు మార్పులతో ప్రగతిశీలగా భాషను మలచినటువంటి యుగపురుషులలో గిడుగు రామ్మూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. సమకాలీకులైన గురజాడ వెంకటఅప్పారావుగారు, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామ్మూర్తి త్రయం సాహితీ, సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు” అని కొనియాడారు. 

“స్వాతంత్య్రం సిద్ధించాక తెలుగు భాషలో తెలుగుదనాన్ని మళ్లీ ఎంతో చాకచక్యంగా ఉపయోగించి తెలుగు ప్రజలను ఆలోచపరిచి వారి అభిమానాన్ని చూరగొన్న ఘట్టం మాతరం వారందరం చూడగలిగాం’’ అని జస్టిస్‌ రమణ వివరించారు. నందమూరి తారక రామారావు అగ్రశ్రేణి సినీనటుడిగా వెలుగొందడం వలనే ఆయన సులువుగా అధికారంలోకి రాగలిగారని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారని, అయితే ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయని చెప్పుకొచ్చారు. 

కానీ,  ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఊరారా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో, అద్భుతమైన ఉచ్ఛారణతో,  అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన  ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర వహించిందని తాను భావిస్తున్నట్లు త్లెఇపారు. ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. 

తెలుగు సినిమా అర్ధం కావాలంటే ఇంగ్లీష్‌ లో సబ్‌ టైటిల్స్‌ చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగు భాషను కాపాడే బాధ్యత  ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని చెబుతూ  ఇకనైనా మేల్కొని దిద్దుబాటు  దిశగా అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

భాషను  కాపాడుకునేందుకు ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ సిద్ధం కావాలని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భాషను మలచుకుంటూ, ప్రపంచ భాషల్లోని మంచిని సమ్మిళితం చేసుకుంటూ, మన భాషను సుసంపన్నం చేసుకోవాలని చెప్పారు. అదే సమయంలో తెలుగు మాధ్యమంలో చదవితే భవిష్యత్‌ ఉండదనే అపోహలు తొలగించాలని పేర్కొన్నారు. 

‘డిగ్రీ వరకు నేను తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఇంగ్లిష్‌ అభ్యాసం 8వ తరగతిలో ఆరంభమైంది. పల్లెటూళ్లో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువు నేర్చుకుని నేను ఈ స్థాయికి చేరుకున్నాన’ని జస్టిస్‌ రమణ చెప్పారు. పాఠ్య పుస్తకాలు, విద్యా బోధన వ్యావహరికంలో సాగడం తనలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. 

గ్రాంథికం కొనసాగి ఉంటే బహుశా తాను జీవితంలో ఎప్పుడూ స్వగ్రామం పొన్నవరం దాటి ఉండేవాడిని కాదేమోనని పేర్కొన్నారు. ‘మనుషులంతా ఆలోచించేది మాతృభాషలోనే. ఆ మాతృ భాషలోనే విద్యాబోధన సాగితే కలిగే ప్రయోజనాలెన్నో. పోటీకి తట్టుకోవాలంటే ఇతర భాషలను, ప్రధానంగా ఆంగ్లాన్ని విస్మరించలేం. అలాగని, ఆంగ్లం కోసం తెలుగుని త్యజించనక్కరలేద’ని చెప్పారు.

జపాన్‌, చైనా పరాయిభాషల మోజులో పడలేదని, తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయని జస్టిస్‌ రమణ చెప్పారు. నిజానికి ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తి బయటివారిని సైతం వారి భాషలను నేర్చుకునేలా పురికొల్పుతున్నాయని అన్నారు. ‘మన భాషే బలంగా, తెలుగు సమాజం కూడా శాసించే శక్తిగా ఎదగాలన్నది నా ఆకాంక్ష. అందుకు ప్రతి ఒక్కరిలో తెలుగంటే గౌరవం పెరగాల’ని చెప్పారు.