పారాలింపిక్స్‌లో భవీనాబెన్ కు రజతం

టోక్యో పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్‌ భవీనాబెన్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావోతో జరిగిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో ఓటమిపాలయింది.  34 ఏండ్ల భవీనాపై 7-11, 5-11, 6-11 స్కోర్‌తో జయకేతనం ఎగురవేసిన జావో.. బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు సార్లు స్వర్ణపతకాన్ని అందించిన యింగ్​ ఝో భారత క్రీడాకారిణికి గెలిచేందుకు అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా గెలుపు యింగ్​ ఝో ఖాతాలో చేరింది. 

 దీంతో భవీనా సిల్వర్‌ మెడల్‌తో దేశానికి రానుంది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి. గుజరాత్‌కి చెందిన భవీనాబెన్‌ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. మొదట్లో ఫిట్‌‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించిన భవీనా ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకుని కష్టపడింది. 

మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్నది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే. భవినాబెన్‌కు టీటీ అంటే ప్రాణం. అది ఎంతగా అంటే ఆటకోసం ఒక్కోసారి కడుపునిండా తినేదికాదు.. కంటి నిండా నిద్రపోయేదీ కాదు.

ఏడాది వయస్సులోనే పోలియో సోకడం, ఆపై డాక్టర్లకు చూపినా వారి సూచనలు పాటించకపోవడం దరిమిలా ఆమె నడుము భాగం వరకు చచ్చుబడిపోయింది. అయితే తన వైకల్యానికి ఆమె బాధపడుతూ కూర్చోలేదు. ఏదో ఒకటి సాధించి దివ్యాంగులు కూడా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోరని నిరూపించాలని దృఢంగా నిర్ణయించుకుంది.

ఆ క్రమంలో అహ్మదాబాద్‌లోని ‘బ్లైండ్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌’కు రావడం, అక్కడ దివ్యాంగ బాలలు టీటీ ఆడడం చూసి ఆమె ఆ క్రీడపట్ల మొగ్గుచూపింది. ఆపై దానినే కెరీర్‌గా ఎంచుకుంది.  ఎంతో సాధన చేసి ఢిల్లీలో జరిగిన క్లబ్‌ స్థాయి టోర్నీలో కాంస్య పతకం గెలవడంతో భవినా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇంకా కష్టపడితే టీటీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని గుర్తించింది. ఆ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది.

ఆ క్రమంలో కొన్నిసార్లు తిండి, నిద్రను కూడా పక్కనపెట్టింది. ఆ ఫలితమే నేడు ఆమె పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే స్థాయికి చేరడం. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని సుంధియా గ్రామం భవినా స్వస్థలం. ఆమె తండ్రి హస్‌ముఖ్‌భాయ్‌ పటేల్‌ చిన్న వ్యాపారి. స్వస్థలం నుంచి అహ్మదాబాద్‌ చేరడం తన జీవితంలో ఊహించని మలుపుగా భవినా చెబుతుంది. ఆమె భర్త నికుల్‌ పటేల్‌ జూనియర్‌ స్థాయిలో క్రికెట్‌ ఆడడం విశేషం.