అమెరికా డ్రోన్ దాడిలో ఐసిస్ ముఖ్యుల్లో ఇద్దరు హతం

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఇటీవలి ఐఎస్‌ఐఎస్ కె జరిపిన ఉగ్రదాడికి అమెరికా సైన్యం శనివారం ప్రతిచర్యకు దిగింది. దేశంలోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా సైనిక డ్రోన్ జరిపిన దాడిలో ఐసిస్ వ్యూహకర్త ఒకరు హతులు అయ్యారు. ఈ విషయాన్ని అమెరికా సైనిక కేంద్రీయ దళాల ప్రతినిధి క్యాప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. 

అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన క్రమపు దశలో ఇస్లామిక్ స్టేట్ దేశీయ సంస్థగా పేర్కొంటూ ఐఎస్‌ఐఎస్ కె ఉనికిలోకి వచ్చింది. అమెరికన్లను దెబ్బతీసేందుకు కాబూల్ వద్ద ఉగ్ర ఆత్మహుతి దాడికి దిగిందని తామేనని ఈ సంస్థ ప్రకటించుకుంది. కాబూల్‌లో జరిగిన రెండు పేలుళ్లు, ఈ ఘటనలలో అమెరికా సైనికులు బలి కావడంపై ప్రెసిడెంట్ బైడెన్ తీవ్రస్థాయిలో స్పందించారు. 

లక్షంగా ఎంచుకున్న ప్లానర్‌పైనే దాడి జరిగింది. ఇది విజయవంతం అయిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని క్యాప్టెన్ బిల్ అర్బన్ వెల్లడించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వేటాడి వారిపని పట్టడం జరుగుతుందని బైడెన్ శపథం వహించారు. ఇందుకు అనుగుణంగానే అమెరికా బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ శత్రువుపై విరుచుకుపడుతున్నాయి.

ఈ నెల చివరికి దేశం నుంచి అమెరికా సేనలు ఉసంహరణ గడువు ఉండటంతో అప్పటిలోగా ఐసిస్ అవశేషాలను తుదముట్టించాలని అమెరికా అధ్యక్షులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా దేశంలో మారుమూల ప్రాంతాలలోకి వైమానిక దాడులను తీవ్రతరం చేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఇప్పుడు అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతుడయినట్లు చెపుతున్న ఐసిస్ కె ప్లానర్ కాబూల్‌లో గురువారం నాటి ఉగ్రదాడికి పాల్పడ్డ వ్యక్తేనా అనే విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు పూర్తిస్థాయిలో నిర్థారించలేదు. గురువారం ఉగ్రవాదుల దాడిలో దాదాపు 200 మంది వరకూ దుర్మరణం చెందారు. వీరిలో 13 మంది వరకూ అమెరికా సైనికులు ఉండటంతో బైడెన్ తీవ్ర కలత చెందారు.

కాగా, కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద వచ్చే 24 నుంచి 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. అందువల్ల కాబూల్‌ ఎయిర్‌పోర్టును పౌరులు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. ఇలా  ఉండగా, ఆఫ్ఘనిస్థాన్‌లో బ్రిటన్‌ సైనికుల 20 ఏండ్ల పోరాటం ముగిసింది. బ్రిటన్‌ సైనికులు స్వదేశానికి పయణమయ్యారని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సైనికులతో కూడిన చివరి విమానం కాబూల్‌ నుంచి బయల్దేరిందని ఆ దేశ రక్షణశాఖ వెల్లడించింది. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత 15 వేలకుపైగా మందిని అక్కడి నుంచి తరలించామని పేర్కొంది. 

తాలిబన్లతో మసూద్ అజహర్ భేటీ

మరోవంక, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇటీవల అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ నేతలతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో తాము నిర్వహించే ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వాల్సిందిగా తాలిబన్ నేతలను మసూద్ కోరినట్టు భావిస్తున్నారు. 

గత వారం కాందహార్‌లో తాలిబన్ సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌తోపాటు మరికొందరు నేతలతో మసూద్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అఫ్ఘన్‌ను ఆక్రమించడాన్ని ముజాహిదీన్ విజయంగా మసూద్ అభివర్ణించారు. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం జిహాదీ(పవిత్ర యుద్ధం) నిర్వహించేవారిని ముజాహిదీన్‌లుగా పేర్కొంటారు.

పాక్‌లోని బహావల్‌పూర్ కేంద్రంగా జైషే మహ్మద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. సిద్ధాంతపరంగా తాలిబన్లతో సాన్నిహిత్యమున్న సంస్థగా జైషేకు పేరున్నది. ఈ రెండు సంస్థలకు చెందిన ఉగ్రవాదులు సున్నీ ఇస్లామిక్ దియోబందీ పాఠశాలల్లో రాజకీయ శిక్షణ పొందేవారే కావడం గమనార్హం.