భద్రతా మండలి ఉగ్రదాడి ప్రకటనలో లేని తాలిబన్ల పేరు

ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వాన్ని  అంతర్జాతీయంగా పరిగణలోకి తీసుకొనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చైనా దౌత్యవేత్తలు తాలిబన్ల దౌత్యవేత్తలను కలువగా,  పాకిస్థాన్, రష్యా సహితం వారి ప్రభుత్వం ఏర్పాటు పట్ల సానుకూలంగా స్పందించాయి.

మరోవంక ఐక్యరాజ్య సమితిలో సహితం సానుకూల స్పందన ఏర్పడుతున్నది. ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర జ‌రిగిన ఉగ్ర‌దాడుల‌పై ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో తాలిబ‌న్ పేరును తీసేసింది. ఆగ‌స్ట్ నెల‌లో భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన భార‌త్‌.. ఈ ప్ర‌క‌ట‌న‌పై సంత‌కం చేసి జారీ చేసింది.

గ‌తంలో ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోయిన మ‌రుస‌టి రోజు అంటే ఈ నెల 16న ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితుల‌పై భద్రతా మండలి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏ దేశ భూభాగంలో నుంచి అయినా ఆప‌రేట్ చేసే ఏ ఉగ్ర‌వాద సంస్థ‌కూ తాలిబ‌న్ లేదా ఏ ఇత‌ర ఆఫ్ఘ‌న్ గ్రూప్ మ‌ద్ద‌తివ్వ‌కూడ‌ద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో భ‌ద్ర‌తా మండ‌లి హెచ్చ‌రించింది. 

తాజాగా ఈ ప్ర‌క‌ట‌న‌లో నుంచి తాలిబ‌న్ పేరును ఎత్తేయ‌డం గ‌మ‌నార్హం. ఐక్యరాజ్య స‌మితికి  భారత్ నుంచి శాశ్వ‌త ప్ర‌తినిధిగా ఉన్న స‌య్య‌ద్ అక్బ‌రుద్దీన్ ఈ ప్ర‌క‌ట‌న‌లో మార్పు గురించి వెల్ల‌డించారు. ప్ర‌క‌ట‌న‌లో నుంచి `టి’ ప‌దం వెళ్లిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. “దౌత్యంలో 15 రోజుల స‌మ‌యం అంటే చాలా ఎక్కువ‌. తాజా ప్ర‌క‌ట‌న‌లో `టి’ ప‌దం లేదు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆగ‌స్ట్ 16, ఆగ‌స్ట్ 27న జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లు చూడండి” అని అక్బ‌రుద్దీన్ ఆ ట్వీట్‌లో చెప్పారు.