తెలంగాణ ప్రగతి కోసం బండి మరో ఉద్యమం `పాదయాత్ర’

తొలుత నిజాం నిరంకుశ పాలన నుండి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించి, భారత దేశంలో విలీనం కోసం; ఆ తర్వాత సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీరు, నియామకాలు, నిధుల విషయంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు సుదీర్ఘకాలం వీరోచిత పోరాటాలు సాగించారు. ఈ పోరాటాల క్రమంలో వేలాదిమంది అమరులయ్యారు. 
 
లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేశారు. కేవలం `ఆత్మగౌరవం’ కోసం తెలంగాణ ప్రజలు రాజీలేని వైఖరి అవలంభించి, నిరంకుశ పాలకులపై తిరగబడ్డారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలోనే వారి కలలను భగ్నం చేస్తుంటే, వారి ఆశలకు తూట్లు పొడుస్తుంటే, మిగులు వనరులతో సంపన్న రాష్ట్రంగా ఏర్పడి నేడు అప్పులకు అన్నిదిక్కుల చూస్తుంటే ఇక్కడి ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. 
 
అందుకనే నేరుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి, అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని, వారి భావోద్వేగాలను పంచుకొని, వారి కష్ట సుఖాలను తెలుసుకొని, వారి సమస్యలు- అవసరాలను గుర్తించడం కోసం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ `ప్రజా సంగ్రామ పాదయాత్ర’ను ఆగష్టు 28 నుండి చేపట్టారు. ఈ యాత్ర ఓట్లకోసం, ఎన్నికలలో విజయం కోసం, రాజకీయ ప్రచారం కోసం చేపడుతున్నది మాత్రం కాదు. 
 
ఉద్యమ పార్టీగా చెప్పుకొంటున్న టి ఆర్ ఎస్, తెలంగాణ ఉద్యమ నేతగా భావిస్తున్న కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు గత ఏడేళ్లలో ఏమేరకు ప్రజలకు చేరుతున్నాయో వారి నుండే తెలుసుకోవడం కోసం బయలుదేరారు. అంతేకాదు, వారిలో చైతన్యం కల్గించి, హామీలను అమలు పరచమని ప్రభుత్వంపై గాంధేయ పద్ధతిలో వత్తిడి తెచ్చేవిధంగా వారిని సమీకరించడం కూడా ఈ యాత్ర ఉద్దేశ్యం. 
 
కేవలం ప్రజల కోసం ఈ యాత్ర 
 
రెండు తెలుగు రాష్ట్రాలలో గతంలో ఎందరో నేతలు పాదయాత్రలు జరిగిపినా అవి చాలావరకు రాజకీయ బలప్రదర్శనాల వలే జరిగాయి. సొంత పార్టీలో రాజకీయ ఆధిపత్యం కోసమో, జరుగనున్న ఎన్నికలలో లబ్ది పొందడం కోసమే జరిపారు. కానీ, ఇప్పుడు బండి సంజయ్ కేవలం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని, వారికి బాసటగా నిలబడటం కోసం, వారితో కలసి పరిష్కారం కోసం నడవడానికి బయలుదేశారు. 
 
అందుకనే పాదయాత్ర సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా, చాల నిరాడంబరంగా, గుడారాలలో మకాం వేస్తూ, శాఖాహారం మాత్రమే భుజిస్తూ, సామాన్య ప్రజలలో ఒకరుగా కలసి పోవడానికి బయలుదేరారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో కూడా అగ్రగామిగా చేసుకొనే విధంగా చేబడుతున్న మరో మహా ఉద్యమానికి ఈ పాదయాత్ర నాంది కాగలదు. 
 
సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు అధికార పక్షం నేతలు ప్రచారం చేసుకొంటున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఆయా పధకాలు అట్టడుగు ప్రజలు ఏమేరకు చేరుతున్నాయి? వాటితో వారే మాత్రం ప్రయోజనం పొందుతున్నారో స్వయంగా తెలుసుకోవడం కూడా బండి సంజయ్ ప్రధాన ఉద్దేశ్యం.
 
అంతేకాదు, పాలనా యంత్రాంగంలో, అధికార పార్టీ నేతలలో నెలకొన్న అవినీతి వారినేవిధంగా ఇబ్బందులకు గురిచేస్తుందో కూడా వెలుగులోకి తీసుకు రానున్నారు. డబల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, గిరిజనులకు మూడెకరాల భూమి, రైతు రుణ మాఫీ…. వంటి ఎన్నో హామీల వర్షం కురిపించారు.
సచివాలయంకే రాకుండా ఫార్మ్ హౌస్ నుండి పాలన సాగించే ముఖ్యమంత్రి దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే ఉండడం గమనార్హం. ఆయన మంత్రులకు, సీనియర్ అధికారులకు సహితం అందుబాటులో ఉండరు. తెలంగాణపై కుటుంభం పాలనను రుద్ది, ప్రజలకు జావీబుదారీతనం అనేడిది లేకుండా పోతున్నది.
ఎన్నికల భారీ పధకాలు ఏమయ్యాయి?
ఒకొక్క ఎన్నిక సందర్భంగా ఒకొక్క భారీ పధకం ప్రకటించారు. అయితే ఇవ్వన్నీ ఎన్నికలకే పరిమితమా? ఆ తర్వాత వాటిని అమలు పరుస్తున్నారా? ఆయా పధకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయా? ఇటువంటి అంశాలపై నేరుగా ప్రజల నుండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
 
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పలికి, నాటి ఉప ప్రధాని  సర్దార్ పటేల్ చొరవతో ఈ ప్రాంతాన్ని భారత్ లో విలీనం జరిపిన సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారిక దినంగా పాటించాలని తెలంగాణ ఉద్యమ సమయంలో గర్జించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే ఎత్తడం లేదు. మతతత్వ మజ్లీస్ తో దోస్తీ కారణంగా మత మార్పిడిలు, గోవధ, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 
 
దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాల ముఠాలు పట్టుబడినా హైదరాబాద్ తో ఏదో ఒక లింక్ బైట పడుతున్నది. అప్పుడపుడు హడావిడి చేయడం తప్పా ప్రభుత్వ పరంగా చర్యలు కనబడటం లేదు. పైగా, ప్రజా ప్రతినిధులను అంగడిలో సరుకుల వలే కొనుగోలు చేస్తూ, ప్రజా నిరసనను ఉక్కు పాదంతో అణచివేసే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలనను గుర్తుకు తెస్తున్నారు. 
 
తెలంగాణ ద్రోహులకు అందలం 
 
తెలంగాణ ఉద్యమ వీరులను అవహేళన చేస్తూ, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కిస్తూ తెలంగాణ ప్రజల `ఆత్మగౌరవం’ను అవహేళన చేస్తున్నారు. ఇక అవినీతికి అంతులేకుండా పాయింది. అత్యవసరమైన సాగునీటి పధకాలు చేపట్టకుండా, లక్ష కోట్ల రూపాయాలు ఖర్చుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు అందీయలేదు. పైగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాలను పలు రేట్లు పెంచేసి, ప్రజా ధనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. 
 
బడుగు వర్గాలకు చెందిన నేతలకు తెలంగాణలో అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. దళితులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, గిరిజనులపై దౌర్జన్యాలకు అంతులేకుండా పోతున్నది. కృష్ణ జలాల పంపకంలో పొరుగు రాష్ట్రంలో లోపాయికారి అవగాహనతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. 
 
జల దోపిడీ అంటూ ప్రజలను రెచ్చగొట్టడమే గాని, నిర్దుష్ట పరిష్కారాలతో కేంద్రం ముందు వస్తే సహాయనిరాకరణ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజల జీవన పరిస్థితులలో చీకటిని తొలగించి, నూతన వెలుగు నింపడం కోసం బండి సంజయ్ బయలుదేరారు. ప్రజల సాధికారికతతో రాష్ట్ర పురోభివృద్దికోసం వారు తమ గళం విప్పే విధంగా చేయడం కోసం ఈ యాత్ర చేపట్టారు.
 
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం కురిసినా ప్రజా జీవనం స్తంభించి పోతున్నది. అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోతున్నది. భూ ఆక్రమణలకు స్వర్గసీమగా మారింది. ముఖ్యంగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటూ, పరిపాలనీ లేకుండా అంతా మజ్లీస్ అరాచకాల ప్రభుత్వం సాష్టాంగ పడుతున్న పాతబస్తీ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుండి సంజయ్ ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. 
 
సాధారణ రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉన్నత స్థాయికి ఎదిగిన సంజయ్ వారి పరిస్థితులు తెలుసుకోవడం కోసం స్వయంగా బయలుదేవారు. వారితో కలసి వారి పరిస్థితులలో మార్పు తీసుకు రావడం కోసం సమాయత్తమయ్యారు. ఈ యాత్ర సందర్భంగా వెలుగులోకి వచ్చిన ప్రజా సమస్యలు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వం కార్యక్రమాలలో వైఫల్యాలపై రాష్ట్ర ప్రభుత్వమే వత్తిడి తేవడం కోసం గాంధేయపద్ధతిలో ఉద్యమం కూడా  ఇదేసమయంలో సంసిద్దమవుతున్నారు. 
 
దళితబంధు పధకం కేవలం ఉపఎన్నిక జరిగే హుజురాబాద్ కు పరిమితం కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా; దీనితో పాటు గిరిజన బంధు, బిసి బంధు, మహిళా బంధు వంటి కార్యక్రమాలు సహితం అమలు జరిపే విధంగా కేసీఆర్ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా దరఖాస్తుల ఉద్యమం చేబడుతున్నారు.
 
అదే విధంగా బిసి, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మల్లింపు; ఉద్యోగ ఖాళీల భర్తీలో ఉదాసీనత, రైతులకు గిట్టుబాటు ధర, దళారీల నుండి రక్షణ వంటి పలు అంశాలపై కూడా ప్రభుత్వంపై వత్తిడి తేనున్నారు. విద్యార్థులు, యువత, రైతులు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాలు, మహిళలు …. అన్ని వర్గాలలో నూతన ఉత్తేజం నింపడం కోసం సమాయత్తమయ్యారు.