ఘనంగా ప్రారంభమైన సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’

2023లో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర `ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం ఘనంగా ప్రారంభమైనది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్లారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,  సీనియర్ నేతలు విజయశాంతి, కె లక్ష్మణ్ లతో కలిసి బండి సంజయ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. అక్టోబర్‌ 2వ తేదీ వరకు 36 రోజుల పాటు ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పాదయాత్ర సాగనుంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం, అవినీతి కేసీఆర్ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యం అంటూ ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు స్పష్టం చేశారు. 

 ‘ఉద్యమకారులను ఆకాంక్షకు విరుద్దంగా టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతుంది. ఏళ్లయినా బంగారు తెలంగాణ కాలేదు. కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా మారింది’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌ను గద్దె దించటానికే బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని వెల్లడించారు. 

తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని, బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

హుజురాబాద్ ఉప‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపిచ్చారు. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో బందీ చేశారని ధ్వజమెత్తారు.  దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం‌ కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామని డీకే అరుణ స్పష్టం చేసారు. 

‘ తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదు.. కుటుంబ పాలన ఉంది. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే పాదయాత్ర నిర్వమిస్తున్నాం. ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల సహకారం కావాలి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం.’ అని సంజయ్ తెలిపారు.

రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రజల్లో విశ్వాసం నింపేందుకే సంగ్రామ యాత్ర చేపట్టినట్టు చెప్పారు. తన యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ, ఉచిత యూరియా పేరుతో రైతులను కేసీఆర్ వంచించాడని, తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

నిరుద్యోగులకు కేసీఆర్ ఇస్తామని భృతి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని దయ్యబట్టారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు సంజయ్. గణేష్ నిమ్మజ్జనం ఊరేగింపును కేసీఆర్ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభించగలరా అని సంజయ్ సవాల్ చేశారు. బీజేపీ ప్రజలందరినీ సమానంగా చూస్తుందని, అయితే హిందువులపై దాడులు జరుగుతూ ఉండే ఉపేక్షింపదని స్పష్టం చేశారు. 

రోజుకు 10 కిలోమీటర్లు నడుస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ యాత్ర సందర్భంగా ప్రశ్నించనున్నారు. నేడు, రేపు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఆయన యాత్ర సాగనున్నది.