బాంబులతో దద్దరిల్లిన కాబుల్ … 72మంది మృతి!

తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే అఫ్గానిస్థాన్‌లో నెత్తుటేర్లు పారాయి. కాబూల్‌ బాంబులతో దద్దరిల్లింది. ఉగ్ర దాడితో హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయం రక్తసిక్తమైంది. గురువారం సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌లోని ‘అబే’ గేట్‌, విమానాశ్రయం ఆవరణలోని బారోన్‌ హోటల్‌ వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. 

ఈ ఘటనలో కనీసం 72 మంది మరణించారు. మరో 143 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, విదేశీయులతో పాటు అమెరికా సైనికులు, తాలిబన్లు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఆత్మాహుతి దాడుల అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అంగీకరించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన సూసైడ్‌ బాంబర్‌ ఫోటోను విడుదల చేసింది. 

పశ్చిమ దేశాలకు చెందినవారు ఎక్కువగా ఉండే బార్‌ హోటల్‌ విమానాశ్రయ గేటుకు సమీపంలో ఉంది. ఆఫ్ఘన్‌ నుంచి ఖాళీ చేయించిన తమదేశస్తులను పశ్చిమ దేశాలు తాత్కాలికంగా ఇక్కడ ఉంచాయి. కొంత మందిని అక్కడి నుంచి తరలించినప్పటికీ, ఇంకా అనేక మంది అక్కడ ఉన్నట్లు తెలసింది. 

విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని ఐసిస్‌ సాయుధ గ్రూపు నుంచి అంతకుముందు బెదిరింపులు వచ్చినందున ఈ పేలుళ్లు దాని పనే అయివుంటుందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ‘అబే’ గేట్‌ వద్ద తొలి పేలుడు జరిగిన కొద్ది సేపట్లోనే హోటల్‌ సమీపంలో రెండో పేలుడు జరిగినట్టు  అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ పేర్కొంది.

ఈ ఘటనలో డజను మంది అమెరికా సైనికులు మరణించగా, ముగ్గురు గాయపడ్డట్టు వెల్లడించింది. కాబూల్‌ పేలుళ్ల వెనుక ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) హస్తం ఉన్నట్టు అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. పేలుళ్ల వెనుక ఐసిస్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, అంతకుముందు కాబూల్‌ విమానాశ్రయంపై ఉగ్రవాద దాడి జరుగొచ్చని, వెంటనే ఆ పరిసర ప్రాంతాలను వీడి వెళ్లాలని తమ పౌరులను అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు హెచ్చరించాయి. ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నాయి.

ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ వరుస పేలుళ్లు జరుగడం గమనార్హం. జంట పేలుళ్లు జరిగిన తర్వాత సెంట్రల్‌ కాబూల్‌లో రాత్రి పొద్దుపోయాక మరో మూడు పేలుళ్లు జరిగినట్టు వార్తలు వచ్చాయి. పేలుళ్ల వార్త విన్న వెంటనే బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కాబూల్‌ విమానాశ్రయంలో బ్రిటిష్‌ పౌరులు, సిబ్బంది పరిస్థితి గురించి ఆరా తీసింది. వారిని సురక్షితంగా దేశానికి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది.

పేలుళ్లలో ఐఎస్ఐఎస్-కె హస్తం

అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, పేలుళ్ల ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్-కె శుక్రవారం ప్రకటించింది. ఐఎస్ఐఎస్-కె లో ఇతర మిలిటెంట్ గ్రూపులకు చెందిన పాకిస్థానీలు, అఫ్ఘాన్లతో పాటు ఉజ్బెక్ తీవ్రవాదులు కూడా ఉన్నారని వెస్ట్ పాయింట్‌లోని పోరాట తీవ్రవాద కేంద్రం తెలిపింది.
కాబూల్ విమానాశ్రయంలో రద్దీగా ఉన్న గేట్‌లను తాకిన ఆత్మాహుతి బాంబర్ చిత్రాన్ని కూడా ఐఎస్ఐఎస్-కె విడుదల చేసింది. దేశం నుంచి పారిపోవాలని తహతహలాడుతున్న అఫ్ఘాన్లకు నిలువరించేందుకు ఈ పేలుళ్లకు పాల్పడ్డారని భావిస్తున్నారు.  ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థ తూర్పు అఫ్ఘానిస్తాన్‌లో ప్రత్యేకించి నంగాహర్, కునార్ ప్రావిన్సులలో ఉనికిని ఏర్పరచుకుంది.
2016 నుంచి ఆఫ్ఘన్ రాజధానిలో, వెలుపల పలు విధ్వంసకర ఆత్మాహుతి దాడులను నిర్వహించిన ఐఎస్ఐఎస్-కె కాబూల్‌లో సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో పాకిస్థాన్ సరిహద్దులోని కొద్ది ప్రాంతాలకు పరిమితమైన ఈ సంస్థ ఆఫ్ఘాన్ కు విస్తరించింది.కాగా కాబూల్ ఆత్మాహుతి బాంబు దాడి వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని చైనా పాకిస్థాన్‌ దేశాన్ని కోరింది.

తాలిబన్లు ఖండన 

ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులను తాలిబన్లు ఖండించారు. ఐసిస్‌ గ్రూప్‌ కాబూల్‌ విమానాశ్రయంపై దాడులకు పాల్పడవచ్చని తాము ముందుగానే అనుమానించామని, ఇదే విషయాన్ని అమెరికాకు కూడా చెప్పామని ఓ ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం అమెరికా దళాల ఆధీనంలో ఉన్నట్టు పేర్కొన్నారు. కాబూల్‌ ఉగ్రవాద దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఖండించారు.

అఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై అత్యవసర చర్చలు జరిపిన జీ-7 దేశాలు, ఆగస్టు 31 తర్వాత కాబూల్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి తాలిబాన్‌ సురక్షితమైన మార్గానికి హామీ ఇవ్వాలని ఏకగ్రీవంగా అంగీకరించాయి. కాబూల్ నుంచి అమెరికా ఇప్పటివరకు 82,000 మందికి పైగా ప్రజలను తీసుకెళ్లినట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.