వేటాడటం మొదలు పెడితే… బైడెన్ హెచ్చరిక

 ‘మేము వేటాడటం మొదలు పెడితే.. మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అంటూ కాబూల్‌ ఆత్మాహతి దాడులకు కారకులైన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గట్టి హెచ్చరిక చేశారు. ఈ దారుణ ఘటనపై తీవ్రంగా మండిపడ్డ బైడెన్‌.. ఈ దాడులకు కారణమైన వారిని వేటాడతామని ప్రతిజ్ఞ చేశారు.

అయితే, ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వేలాది మంది పౌరులను తరలించే ప్రక్రియ నుండి వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ‘ఈ దాడులకు పాల్పడిన వారు, అదేవిధంగా అమెరికాకు హాని తలపెట్టాలని ఎవరైతే కోరుకుంటున్నారో… గుర్తుపెట్టుకోండి. మేము క్షమించేది లేదు. మర్చిపోం. మేము వేటాడటం మొదలు పెడితే… మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ భారీగా హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ దాడి ఘటన తర్వాత వైట్‌ హౌస్‌లో మాట్లాడిన బైడెన్‌ బాంబు పేలుళ్లలో చనిపోయిన అమెరికా జవాన్లను ‘హీరోలు’గా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్‌ఐఎస్‌ నాయకులను హతమార్చాలని అమెరికన్‌ ఆర్మీని ఆదేశించారు.

‘కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టం. వారిని క్షమించం. వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా పౌరులను తరలిస్తాం. మా మిషన్‌ కొనసాగుతుంది. కాబూల్‌ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్‌ కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని జో బైడెన్‌ ప్రకటించారు.

‘ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా.. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తాము ప్రమాదకర మిషన్‌ను కొనసాగిస్తున్నాం. బాంబు దాడులు జరిగినా కాబుల్‌ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదు. ఈనెల 31 నాటికి తమ బలగాలను ఉపసంహరించుకుంటాం. కాబుల్‌ పేలుళ్ల ఘటనలో కనీసం 72 మంది మృతి చెందారు. వారిలో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారు’ అని చెప్పారు.

ఆగస్టు 31 నాటి కల్లా కాబూల్‌ నుండి పౌరులను, అమెరికా దళాలను తరలిస్తామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు భయపడేది లేదని, మా మిషన్‌ను అడ్డుకునేందుకు అనుమతించేది లేదని, తరలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముప్పు గురించి, మరో దాడికి పాల్పడే అవకాశాల గురించి తెలుసుకోవడం ద్వారా సైన్యం ఏం చేయాలో స్పష్టమైన వైఖరిని కల్గి ఉందని ఆయన చెప్పారు. 

ఇలా ఉండగా, తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్‌ నుంచి తరలించామని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించారు. 

గత 12 గంటల్లో 39 విమానాల్లో సుమారు 7500 మంది కాబూల్‌ నుంచి తరలించామని పేర్కొన్నారు. కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు దాడి అనంతరం వైట్‌హౌస్‌ ఈమేరకు ప్రకటన వెలువరించింది. ఆ దాడుల్లో 72 మంది మరణించగా, అందులో అమెరికా రక్షణ సిబ్బంది 13 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మరో 143 మంది గాయపడ్డారని చెప్పారు.

కాగా, 2001 నుంచి ఇప్పటివరకు ఆఫ్ఘనిస్థాన్‌లో 2300 మందికిపైగా అమెరికన్లు కన్నుమూశారని, 20 వేల మందికిపైగా గాయపడ్డారని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జే బ్లింకెన్‌ వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులతో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో 8 లక్షల మందికిపైగా సైనికులు, ఇతర అమెరికన్లు పాల్గొన్నారని తెలిపారు.

కాబుల్ దాడులను ఖండించిన భారత్ 

కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపచం ఏకతాటిపై నిలబడాల్సిన అవసరాన్ని బలోపేతం చేశాయని పేర్కొంది.  ఈ ఘటనను ఖండించిన భారత్‌ ‘గురువారం జరిగిన దాడులు ఉగ్రవాదం, ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రపంచం ఐక్యంగా నిలబడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపింది.

తాలిబాన్లకు పాక్ రెండో ఇల్లు!

ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల స్వాధీనం కావడంలో కీలక పాత్ర వహించిన పాకిస్థాన్ తమకు రెండో ఇల్లు అంటూ  తాలిబన్‌ ఆధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించడం కలకలం రేపుతున్నది. అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మత విశ్వాసాల పరంగా కూడా తాము ఒకే కోవకు చెందిన వారమని  చెప్పారు.ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని కూడా పేర్కొన్నారు.