భారత్ విశ్వగురు పీఠాన్ని మరోసారి అధిష్టించాలి 

విద్యలో మరోసారి విశ్వగురు పీఠాన్ని భారత్ అధిరోహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. గతంలో భారతదేశం విశ్వగురువుగా వెలుగొందిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, నలంద, తక్షశిల, పుష్పగిరి వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు మార్గదర్శనం చేశాయని గుర్తు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనదినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విశిష్ట అతిథిగా పాల్గొంటూ గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం – 2020 (ఎన్ఈపీ) ద్వారా భారతీయ విద్యారంగంలో పరిపూర్ణమైన మార్పులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
భారతదేశ విశ్వవిద్యాలయాల ప్రపంచీకరణ జరగాల్సిన అవసరం గురించి చెబుతూ అంతర్జాతీయంగా ఉత్తమ విద్యాసంస్థలు విశ్వవ్యాప్తంగా తెలివితేటలు కలిగిన విద్యార్థులను ఆకర్షిస్తూ వారి మేధస్సుకు మరింత పదునుపెడుతూ ఉత్తమ విద్యాసంస్థలుగా నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 
 
వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంటూ విద్యార్థుల శక్తి సామర్థ్యాలను తమ దేశపు ఆర్థికాభివృద్ధికి సద్వినియోగపరుచుకుంటున్నాయని, మనం సైతం ఇదే స్థాయికి చేరాలని సూచించారు.
 
మానవీయ శాస్త్రం (హ్యుమానిటీస్), సామాజిక విజ్ఞానం (సోషల్ సైన్సెస్), నైతిక విలువలు, భారత జాతీయత తదితర అంశాలపై నూతన విద్యావిధానం ప్రత్యేకమైన దృష్టిసారించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు కృత్రిమ మేధ, బిగ్ డేటా వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవాలని సూచించారు.

ఇటీవల కాలంలో అభ్యాసన ప్రక్రియలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని చెబుతూ  వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరగాలని సూచించారు. సామాజిక, ప్రాంత అభివృద్ధితోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలో ఉన్నతవిద్య కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
 
అనంతపురంలోని ఈ విశ్వవిద్యాలయం జిల్లాతోపాటు రాయలసీమ ప్రాంతంలోని యువత శక్తిసామర్థ్యాలను వెలికితీసి ఈప్రాంతాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో చొరవతీసుకునేలా, ప్రారంభం నుంచే వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించేలా విద్యాసంస్థలు-పారిశ్రామిక సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారధులను నిర్మించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానమైన విద్యావకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలుపరచాలని సూచించారు.భారతీయ భాషల్లో ఆన్‌లైన్ కోర్సుల కొరతను ప్రస్తావిస్తూ, ఎడ్యుటెక్ రంగంలోని  ప్రైవేటు సంస్థలు, ప్రాంతీయ భాషల్లో కోర్సుల రూపకల్పనకు నడుంబిగించాలని ఆయన సూచించారు.