పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టు పోలీస్‌స్టేషన్లు

టూరిస్టు పోలీస్‌ స్టేషన్లు పెట్టాలని దేశ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, అన్ని రాష్ట్రాల్లో ఉండే పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

రూ.4.18 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భద్రత ఉంటేనే ఎక్కువ మంది టూరిస్టులు వస్తారని పేర్కొన్నారు. సైబర్‌ క్రైమ్‌ పెద్ద ఛాలెంజ్‌గా మారిందని, ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇవి అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. దేశంలోనే ఉత్తమ డీజీపీగా మహేందర్‌రెడ్డికి మంచి పేరు ఉందని కొనియాడారు. 

డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసుల పనితనాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇలాంటి నూతన భవనాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్క సిటిజన్‌కు న్యాయం, భద్రత కల్పించడం పోలీసుల లక్ష్యమని వివరించారు. 

నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అనేక పోలీస్‌ స్టేషన్‌ భవనాలు సీఎం కేసీఆర్‌ చొరవతో అధునాతన భవనాలుగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల చొరవతో సీసీ టీవీ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 41 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

 రాష్ట్రానికి కోటి 68లక్షల 61వేల 809 వ్యాక్సిన్ డోసులు పంపించినట్లు తెలిపారు.13.18లక్షల డోసులు తెలంగాణలో నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఉచితంగా  అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.