185 జిల్లాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్ధకరం 

ఈరోజున దేశంలోని185 జిల్లాలలో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే  ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు హిందువుల పండుగలను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదని తెలిపారు.

రక్షాబంధన్ పురస్కరించుకొని భాగ్యనగరంలోని కోటి లో గల విశ్వహిందూపరిషత్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  స్వాతంత్రానికి పూర్వం విదేశీయులతో స్వాతంత్రం అనంతరం, దేశద్రోహులైన స్వదేశీలతో హిందువులకు ఘర్షణ కొనసాగుతూనే ఉందని చెప్పారు.  

జనాభా నియంత్రణ లెక్కల్లో ” మేము  ఏ మతానికి చెందని వారము కాదు” అని చెప్పే వారి సంఖ్య కోట్లలో ఉందని చెబుతూ వారంతా హిందువులేనని తెలిపారు. ప్రస్తుతం జనాభా లెక్కలు తీసినట్లయితే భారతదేశంపై విదేశీయుల ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోందని చెప్పారు. 

లెక్కకు మించిన సంఖ్యలో మత మార్పిడీలు  జరుగుతున్నాయని, ప్రభుత్వాలే దగ్గరుండి ఆ పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సువిశాలమైన భారతదేశంలో కొండలు.. కోనలు.. అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులను హిందుత్వానికి దూరం చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

దళితులు, ఆదివాసులు హిందువులు కారని అర్బన్ నక్సలైట్లు వారి మెదళ్ళలో విషం నింపుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం మనం నిర్వహించుకుంటున్న పండుగలు అతి ప్రాచీనమైనవని, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆచార వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయని పరాండే తెలిపారు.

దాదాపు 2000 సంవత్సరాల నుంచి విదేశీయుల దురాక్రమణ ఎదుర్కొని హిందువులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. శాంతికాముకులు గా ఉన్న హిందువులపై విదేశీయులు నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారని,  దానిని తిప్పికొట్టేందుకు, హిందువుల మనోభావాల రక్షణ కోసం నిరంతరం సంఘర్షణ చేస్తూనే ఉన్నారని తెలిపారు.

విదేశీయుల భావజాలం పెరిగిపోయి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంవల్ల అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని కోర్టులలో  విడాకుల దరఖాస్తు  శాతం చూస్తే కుటుంబ వ్యవస్థకు పట్టిన గ్రహణం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆత్మీయత.. అనురాగం.. మమకారం కలగలిపి, సోదరభావాన్ని పెంపొందించే రక్షాబంధన్ కార్యక్రమం వల్ల సమాజంలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఒకరికి ఒకరు సహకారం చేసుకునే ఐక్యతను సూచించే ఈ పండుగ అత్యంత పవిత్రమైన దని మిలింద్ చెప్పారు. 

హిందువులు తమ జీవన పద్ధతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా జల సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ.. చెట్ల రక్షణ.. నదుల రక్షణ.. భూ రక్షణ.. కాలుష్య నివారణ చేపట్టాలని సూచించారు. హిందువుల పండుగలలో ఇవన్నీ కనిపిస్తాయని చెప్పారు.

నేడు దేశంలో పెరిగిపోయిన విదేశీ మూకలను అంతం చేయాలంటే  జాతీయ భావాలు గల సజ్జనులు అంతా ఒకటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ధర్మ రక్షణ చేయకపోతే దేశ రక్షణ కష్టమని, ధర్మాన్ని కోల్పోతే దేశం ముక్కలవుతుందని హెచ్చరించారు. అందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజనే ఉదాహరణ అని ఆయన వివరించారు.

అనంతరం “నీవు నాకు రక్ష -నేను నీకు రక్ష మనమంతా ధర్మానికి రక్ష” అంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఒకరికొకరు రక్షలు కట్టుకున్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు స్థాను మలై, రాఘవులు, సత్యం జి, కేశవ్ హెడ్గే, బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాములు తదితరులు పాల్గొన్నారు.