సోనియా భేటీ రాహుల్ కోసమా? మోదీపై పోరు కోసమా?

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 20న 19 ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జరిపిన భేటీ 2024 ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీపై ఉమ్మడిగా గురిపెట్టి,  ఓడించడం కోసమే అన్నట్లు మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. విప‌క్షాల‌కు 2024 ఎన్నిక‌లే అంతిమ ల‌క్ష్య‌మ‌ని, ఈ ఎన్నిక‌ల్లో రాజ్యాంగ విలువ‌ల ప‌ట్ల విశ్వాసం ఉండే ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని సోనియా దిశానిర్ధేశం చేసిన్నట్లు చెప్పుకొచ్చారు.

నిర్దిష్టమైన వ్యూహం గాని, కార్యాచరణ గాని లేకుండా, కేవలం ప్రధాని మోదీని ఓడించడమే లక్ష్యంగా గత కొన్ని ఏండ్లుగా పలు ప్రతిపక్ష నేతల భేటీలు  జరుగుతూ వస్తున్నాయి. కానీ ఏవి కూడా ఎటువంటి ఫలితం సాధింపలేక పోయాయి.  పైగా, ఈ పర్యాయం సోనియా గాంధీ జరిపిన భేటీ మోదీపై ఉమ్మడి పోరాటం కోసం కాకుండా, ప్రతిపక్షాలలో కుమారుడు రాహుల్ గాంధీ పట్ల తొలగుతున్న విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నంగానే కనిపిస్తున్నది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మూడోసారి అధికారంలోకి రాగానే ఆమె సారధ్యంలో ప్రతిపక్షాలు బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయనున్నారనే కధనాలు రావడం గమనార్హం. ఆమె కూడా ఎన్నికల సందర్భంగా రాబోయే రోజులలో తాను ఢిల్లీలో ఎక్కువకాలం గడుపుతూ, జాతీయ రాజకీయాలపై దృష్టి సారింపబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. 

బిజెపి, కాంగ్రెస్, లేని కూటమి ఏర్పాటు చేయాలని పలు ప్రాంతీయ పక్షాలు కొన్ని ఏండ్లుగా నినాదాలు ఇస్తూ వస్తున్నాయి. బెంగాల్ ఎన్నికలు కాగానే ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ఇంట్లో ఢిల్లీలో రాష్ట్రీయ మోర్చా జరిపిన భేటీకి కాంగ్రెస్ గైరాజరు కావడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి కోసం ప్రయత్నాలు బయలుదేరుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 

ఈ సమయంలో మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చి పలువురు ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె ప్రయత్నం అంతా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు అన్నట్లుగా కధనాలు వెలువడ్డాయి. ఈ సంకేతాలు అన్ని చూస్తుంటే 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీ సారధ్యంలో ఎన్నికలకు వెళ్ళడానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవని స్పష్టం అవుతుంది.

భాగస్వామ్య పాత్ర వహించడం మినహా, ఆ పార్టీ నాయకత్వంలో కూటమి ఏర్పాటుకు సిద్ధంగా లెమనే సంకేతాలు కూడా పలు ప్రాంతీయ పార్టీలు ఇస్తున్నాయి. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినా ఆ పార్టీకి చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించడం లేదు.

తమిళనాడులో డీఎంకే కూటమి అధికారంలోకి వచ్చినా, ఆ కూటమిలో భాగస్వామి అయినా కాంగ్రెస్ గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ తో పొత్తు కొనసాగింపు పట్ల జెడి(ఎస్) ఆసక్తి ప్రదర్శించడం లేదు. త్వరలో ఎన్నికలు జరుగబోతున్న ఉత్తర ప్రదేశ్ లో ఆ పార్టీతో పొత్తు ఎవ్వరు ముందుకు రావడం లేదు.  ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాహుల్ నాయకత్వం పట్ల ప్రతిపక్షాలు విముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుకోవడంలో 19 ప్రతిపక్షాలు  గతంలో ఎన్నడూ లేని విధంగా సమిష్టిగా వ్యవహరించాయి. దేనిని ఒక అవకాశంగా తీసుకొని, మమతా ఢిల్లీ రాకముందే వాటికి తానే నాయకుడినని సంకేతం పంపడం కోసం రాహుల్ ప్రతిపక్ష నేతలతో ఆగష్టు 3న బ్రేక్ ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేశారు.

కానీ, ఈ సమావేశానికి ప్రతిపక్షాల ముఖ్యనేతలు ఎవ్వరు హాజరు కాలేదు. ద్వితీయ స్థాయి నేతలు మాత్రమే పాల్గొనడం ద్వారా రాహుల్ నాయకత్వం పట్ల తమకు విశ్వాసం లేదని స్పషటమైన సంకేతం ఇచ్చారు. బీఎస్పీ, ఆప్ వంటి పార్టీలు హాజరు కాలేదు. సిపిఎం నేత సీతారాం ఏచూరి చొరవ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

ఎన్సీపీ, టిఎంసి, ఎస్పీ వంటి పార్టీలు హాజరైన ముఖ్యనేతలు రాలేదు. పార్లమెంట్ లో పెగాసస్ అంశంకే పరిమితం కాకుండా అధిక ధరలు వంటి ఇతర ప్రజా సమస్యలపై కూడా గళం ఎత్తాలని అంటూ రాహుల్ కు పలు పక్షాలు హితవు చెప్పాయి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశాయి. దానితో రాహుల్ కొంచెం ఇరకాటంలో పడ్డారు. 

అయితే వారం రోజుల తరవాత, ఆగష్టు 9న  కాంగ్రెస్ అసమ్మతి నేత కపిల్ సిబాల్ ఏర్పాటు చేసిన విందుకు శరద్ పవర్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముందు రాహుల్ సమావేశం వెలవెల పోయింది. ప్రతిపక్ష శిబిరంలో ప్రతికూల సంకేతాలు పంపింది.

అందుకనే ప్రతిపక్ష నేతలను ఒక వేదికపైకి మమతా, పవర్ వంటి నేతలు నేతలు తీసుకు రాలేరని, కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పడం కోసమే సోనియా గాంధీ హడావుడిగా వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. అనుకున్నట్లుగానే బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు శరద్ పవర్, తేజశ్వి యాదవ్, సీతారాం ఏచూరి, ఫారూఖ్ అబ్దుల్లా,మెహబూబా ముఫతి, జయంత్ చౌదరి వంటి నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో సోనియా- రాహుల్ నాయకత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతలకు ఒక విధమైన హెచ్చరిక జారీ చేయడం కూడా ఈ సమావేశం ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత చాటిచెప్పడం కోసం ఈసమావేశం ఏర్పాటు చేసిన్నట్లు చెబుతున్నా వారిలోని వైరుధ్యాలే వెల్లడయ్యాయి. ప్రతిపక్ష ఐక్యతకు వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలక పరీక్షా కాగలవు. అయితే ఆ రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్షాలు సమాజ్ వాద్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ హాజరు కాలేదు. దానితో ఉమ్మడిగా ప్రతిపక్షాలు మోదీని ఎదుర్కొనే అవకాశాలను ప్రశ్నార్ధకరం చేస్తున్నాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో మండుతున్న ఆప్, అకాలీదళ్ వంటి పార్టీలు కూడా పాల్గొనలేదు. వారిని ఆహ్వానించక పోవడంతో ఉమ్మడిగా పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధంగా లేవనే సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. కాంగ్రెస్ లో సహితం రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ మధ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ నుండి పార్టీని వీడుతున్న పలువురు నేతలు సోనియా, రాహుల్ లకు సన్నిహితులే కావడం గమనార్హం.