300 మంది తాలిబన్లను హతమార్చిన పంజ్‌షీర్ సేనలు

ఆఫ్ఘానిస్తాన్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకొని, అరాచకాలు సాగిస్తున్న తాలిబాన్లకు  పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ మాత్రం మింగుడు పడటం లేదు. గత 20 ఏళ్లకు పైగా తాలిబాన్లకు ప్రవేశం లేకుండా అడ్డుకొంటూ వస్తున్న ఈ ప్రాంతం ఇప్పుడు తాలిబాన్లపై యుద్ధం ప్రకటించింది. అయితే వారిని కట్టడి చేయడం కోసం పెద్ద సంఖ్యలో కలసి వెళ్లిన తాలిబాన్లకు తీవ్ర పరాభవం ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నిన్నారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తున్నది.

ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 

తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్‌ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్‌ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్‌ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్‌షీర్‌ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. 

ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్‌ ప్రవేశ ద్వారం వద్ద తాలిబన్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఈ ఉదయం తెలిపారు. తాలిబన్లతో వ్యతిరేక శక్తులు పోరాడుతున్నాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఉదయం ట్వీట్‌ చేశారు.

‘పొరుగున ఉన్న అండరాబ్‌ లోయలోని ఆకస్మిక జోన్లలో చిక్కుకున్న తర్వాత.. పంజ్‌షిర్‌ ప్రవేశం వద్దకు భారీగా తాలిబన్లు చేరుకున్నారు. అంతలో సలాంగ్‌ హైవేను బలగాలు మూసివేశాయి. తాలిబన్లను నివారించాల్సి భూభాగాలున్నాయి. మళ్లీ కలుద్దాం’ అని ట్వీట్‌ చేశారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను వ్యతిరేకంగా పోరాడుతున్న బలగాలు పంజ్‌షీర్‌ వ్యాలీకి దగ్గరగా ఉన్న మూడు జిల్లాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ప్రభుత్వ దళాలు, ఇతర మిలీషియా గ్రూపుల సమూహాలు పంజ్‌షీర్‌లో సమావేశమయ్యాయి.

పంజ్‌షీర్‌లోకి తాలిబన్లు రాకుండా ప్రతిఘటిస్తామని అంతకముందు మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే, మాజీ ముజాహిదీన్‌ కమాండర్‌ అహ్మద్‌ షా కుమారుడు అహ్మద్‌ మసూద్‌ ట్వీట్‌ చేస్తూ, పింజ్‌షార్‌ వ్యాలీ నుంచి తాలిబాన్లను పూర్తిగా తరిమేసేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

వ్యాలీలోని స్థానిక మిలీషియా గ్రూపులు, ఆర్మీ, ప్రత్యేక దళాలకు చెందినవారు మొత్తం 6వేల మంది ఒక చోట గుమికూడి తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్రతిఘటనను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు మసూద్‌ సన్నిహితులకరు తెలిపారు. ఆనాడు సోవియట్‌ దళాలు వదలి వెళ్లిన ఆయుధ శకటాలను, హెలికాప్టర్లను, మిలిటరీ వాహనాలను మరమ్మతులు చేసుకుని స్థానిక మిలీషియా గ్రూపులు ప్రస్తుత దాడుల్లో ఉపయోగిస్తున్నాయి.