ప్రభుత్వ లాంఛనాలతో కల్యాణ్‌సింగ్ అంత్యక్రియలు

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు ముగిసాయి. బులంద్‌షహర్‌లోని నరోరా టౌన్‌  బన్సీ ఘాట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. కల్యాణ్ సింగ్ చితికి ఆయన కుమారుడు, లోక్ సభ సభ్యుడు రాజ్‌వీర్ సింగ్ నిప్పుపెట్టారు. 

దివంగత నేతకు తుది నివాళులు అర్పించడానికి వేలాది మంది క్యూలో నిలబడ్డారు.  ‘జై శ్రీ రామ్’ , ‘బాబు జీ అమర్ రహేన్’ నినాదాలు ప్రతిధ్వనించాయి. సింగ్ తన కర్మభూమిగా భావించిన దిబాయిలో దహన సంస్కారాలు జరిగాయి.  అతను బులంద్‌షహర్ నుండి లోక్‌సభకు ఒకసారి, రెండుసార్లు డిబాయ్ నియోజకవర్గం నుండి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మంత్రులు ప్లహ్లాద్ పటేల్, వీకే సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర నేతలు చివరిసారిగా తమ ప్రియతమ నేతకు నివాళులర్పించారు. దీనికి ముందు లక్నోలోని అహిల్యాబాయ్ హోల్కర్ స్టేడియం నుంచి కల్యాణ్ సింగ్ పార్థివదేహాన్ని వాహనంలో ఉంచి ‘అంతిమయాత్ర’ నిర్వహించారు. 

కాగా, కల్యాణ్ సింగ్‌తో బీజేపీ అనుబంధాన్ని హోం మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, బాపూజీ (కల్యాణ్ సింగ్) మృతి బీజేపీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయడం చాలా కష్టమని చెప్పారు. రామమందిర్‌ నిర్మాణానికి శంకుస్థాపన రాయి వేయగానే ఆయన తన జీవితాశయం నెరవేరిందని చెప్పారని, రామజన్మ భూమి ఆందోళన కోసం రెండో ఆలోచనకు కూడా తావులేకుండా తన ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారని గుర్తుచేశారు.

మొదటి తన సంక్షిప్త పదవీకాలంలో ఆయన సమర్థవంతమైన పాలనా దక్షుడిగా పేరొందారు. ఆ సమయంలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కు అధికారులపై నెట్టివేయకుండా తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.  తన సహచరుల నుండి అపారమైన గౌరవాన్ని పొందేవారు.  రాష్ట్ర అసెంబ్లీలో ఆయన లేచిన క్షణం, ప్రతిపక్ష నాయకులు కూర్చునేవారు. అప్పటి వరకు అంతరాయాలు క్రమం జరుగుతున్నా, అతని ప్రసంగాలను మాత్రం నిశ్శబ్దంగా ఆలకించేవారు.

బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజున కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం దిగిపోయింది, కానీ కూల్చివేతను నిరోధించడంలో విఫలమైనందుకు ఒకరోజు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, తీహార్ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు సింగ్ అతి పెద్ద హిందూ నాయకుడిగా ఎదిగాడు. సింగ్ హిందూత్వ ఛాంపియన్‌గా కాకుండా, అసమానమైన ఓబిసి నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.

కాగా,   అయోధ్య‌లో రామ జ‌న్మ‌భూమికి వెళ్లే రోడ్డుకు క‌ళ్యాణ్ సింగ్ పేరు పెడుతున్న‌ట్లు యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య వెల్ల‌డించారు. అయోధ్య‌లోనే కాకుండా ల‌క్నో, ప్ర‌యాగ్‌రాజ్‌, బులంద్‌ష‌మ‌ర్‌, అలీగ‌ఢ్‌ల‌లో ఒక్కో రోడ్డుకు క‌ళ్యాణ్ సింగ్ పేరు పెడుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.