నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే

ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతిపనులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆటలు, హావభావాలన్నింటి సమాహారమే జానపద విజ్ఞానమని తెలిపారు.

 ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు జానపద కళాకారులు అంతర్జాల వేదిక ద్వారా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ జానపద సంపద లేకుండా భాషాభివృద్ధి, సాంస్కృతికాభివృద్ధి జరుగవని, ఈ రెండింటి పుట్టుక జానపదం నుంచే మొదలైందని పేర్కొన్నారు. 

అమ్మ పాడే లాలిపాటలు, అలసట తెలియకుండా పాడుకునే శ్రామికుల గీతాలు, జీవితాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక తత్త్వాలు.. ఇలా ఏ సాహిత్యాన్ని చూసినా జానపద వాసన స్పష్టంగా కనబడుతున్న చెప్పారు. పల్లె ప్రజల శ్రమను మరిపించేందుకు పుట్టిన జానపదాలు.. తదనంతర కాలంలో సామాజిక రుగ్మతల మీద పోరాటానికి ఎంతగానో ఉపయుక్తమయ్యాయని  చెప్పారు

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో జానపదాలు పాత్ర కీలకపాత్ర పోషించాయని గుర్తుచేశారు. హంగు, ఆర్భాటం లేకుండా సరళమైన, చిన్న చిన్న పదాలతో లోతైన అంశాలను సైతం పండితుల నుంచి పామరుల వరకు సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలియజేయడమే జానపదం గొప్పదనమని తెలిపారు.

ప్రకృతిని, సహజత్వాన్ని, సమాజాన్ని, రస పరిపూర్ణతను ప్రతిబింబించే జానపద సాహిత్యం ఏనాడూ మేధోసంపత్తి హక్కుల (పేటెంట్ రైట్స్) కోసం ప్రయత్నించలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన పెద్దలు జానపద సాహిత్యం ద్వారా తమ భావాలను, స్థానిక సమస్యలను వాటి పరిష్కారంలో తమ అనుభవాల సారాన్ని పాటలు, కథలు, కళల రూపంలో ముందు తరాలకు అందించారని తెలిపారు.

ఇదే వేదిక నుంచి ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జానపద గాయకుడు దామోదరం గణపతి రావు, నారాయణరావు, దామోదర జానపదం, డాక్టర్‌ గుడిసేవ విష్ణుప్రసాద్‌, జానపద పరిశోధకులు డాక్టర్‌ సగిలి సుధారాణి, జానపద గాయకుడు డాక్టర్‌ లింగ శ్రీనివాస్‌తోపాటు దేశవిదేశాలకు చెందిన జానపద కళాకారులు, జానపద కళాభిమానులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.