‘జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్‌’తో రూ 6 లక్షల కోట్లు

వచ్చే 2024-25 సంవత్సరం నాటికి రూ.6 లక్షల కోట్లు సమీకరణ లక్ష్యంగా ఎంఎన్‌పి (నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్) పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. దీని ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాలలో కేంద్రం విక్రయించే ప్రభుత్వ ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తారు. ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
 
ప్రభుత్వం ఎలాంటి ఆస్తులను విక్రయించబోదని, నిర్ణీత గడువు తర్వాత వెనక్కి తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఖజానా నింపేందుకు, ద్రవ్య లోటును నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు, అలాగే దీర్ఘకాలంలో మౌలిక సదుపాయాల రంగానికి నిధుల సహకారం అందించేందుకు ఈ ప్రణాళిక దోహదం చేస్తుంది. పాత, ప్రస్తుత ఆస్తులలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపి) అనే ప్రణాళికను ప్రారంభించారు.
దీని ప్రకారం, రహదారి, రైల్వే ఆస్తులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రసార మార్గాలు, గ్యాస్ పైప్‌లైన్‌లను విక్రయించకుండా ప్రైవేటురంగ పెట్టుబడులు తీసుకురానున్నారు. ఆర్థిక మంత్రి  సీతారామన్ ఈ ప్రణాళికకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రైవేట్ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం వాటిని మానిటైజ్ చేస్తుందని, ఈ నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. 
“ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా, మేము దానిని (ఆస్తులు) మెనటైజ్ చేయబోతున్నాము. డబ్బు ఆర్జన ద్వారా మీరు సంపాదించిన వనరుతో, మౌలిక సదుపాయాల కల్పనలో మరింత పెట్టుబడులు పెట్టగలరు” అని మంత్రి పేర్కొన్నారు.
 
ఎన్‌ఎమ్‌పి పరిధిని నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ ఎలా వివరించారు:  “ప్రజా అధికారులు చొరవ పనితీరును పర్యవేక్షించడానికి, పెట్టుబడిదారులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేయడానికి ఒక క్రమబద్ధమైన, పారదర్శక యంత్రాంగాన్ని రూపొందించడం   ఎన్‌ఎమ్‌పి  లక్ష్యం. అసెట్ మోనటైజేషన్ అనేది కేవలం నిధుల యంత్రాంగాన్ని మాత్రమే కాకుండా, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, వృద్ధి, నిర్వహణలో మొత్తం నమూనా మార్పుగా పరిగణించబడుతుంది.”

“ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు వంటి కొత్త నమూనాలు కేవలం ఆర్థిక,  వ్యూహాత్మక పెట్టుబడిదారులను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ ఆస్తి తరగతిలో పాల్గొనడానికి వీలు కల్పిస్తాయి.  తద్వారా పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరవబడతాయి. అందువల్ల భారతదేశ మౌలిక సదుపాయాలను నిజంగా ప్రపంచ స్థాయిగా తీర్చిదిద్దడానికి ఎన్‌ఎమ్‌పి పత్రాన్ని ఒక కీలకమైన దశగా నేను భావిస్తాను, ”అని ఆయన వివరించారు.

నీతిఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సంబంధిత లైన్ మంత్రిత్వ శాఖలు చేపట్టిన బహుళ-వాటాదారుల సంప్రదింపుల ద్వారా ఏకీకృతం చేయబడిన ఫీడ్‌బ్యాక్, అనుభవాల నుండి ఎన్‌ఎమ్‌పి రూపొందించారు. సంబంధితులతో  నీతి ఆయోగ్ ద్వారా ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన అంతర్-మంత్రివర్గ సమావేశంలో దీని గురించి సుదీర్ఘంగా చర్చించారు.


ఈ నెల ప్రారంభంలో, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ప్రభుత్వం జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ పైప్‌లైన్‌లతో సహా మౌలిక సదుపాయాల ఆస్తులను ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. 
ప్రభుత్వ పెట్టుబడులకు ఆధారం కల్పించేందుకు, బడ్జెట్‌ లోటును పూరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. రహదారులు, రైల్వే ఆస్తులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ సరఫరా లైన్లు, గ్యాస్‌ పైప్‌లైన్స్‌ను విక్రయించనుంది.
 
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 1.75 ట్రిలియన్‌ల బడ్జెట్‌లో ఈ విక్రయాలను కూడా చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారితో పన్ను సేకరణ ద్వారా వచ్చే ఆదాయంలో నమోదైన క్షీణతను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింద భారత జీవిత బీమా (ఎల్‌ఐసి), భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌, ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి కంపెనీల వాటాలను కూడా విక్రయించనుంది. మౌలిక సదుపాయాల ఆదాయాల కోసం నిర్మల సీతారామన్‌  11 మంత్రిత్వ శాఖలతో కలిసి ఈ ప్రణాళికలను ప్రకటించారు. 
 
కాగా, రాష్ట్రాలు తమ ఆస్తులను మానిటైజ్ చేయడానికి కేంద్రం నుండి ప్రోత్సాహకాలను పొందనున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఆస్తులు మాత్రమే మోనెటైజ్ చేస్తారు. అయితే రాష్ట్రాలు తమ ఆస్తులను మానిటైజ్ చేసేందుకు గాను కేంద్రం ప్రోత్సాహకాలు అందివ్వనుంది. 
 
రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీ లేకుండా రుణం ఇవ్వనున్నారు. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 5,000 కోట్లు కేటాయించారు.రాష్ట్రాలు తమ కంపెనీలలో దేనినైనా విక్రయిస్తే కేంద్రం దాని నుండి అందుకున్న మొత్తానికి సమానమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం ఇస్తుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. తదనంతరం రాష్ట్రాలు దానిని స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ చేయాలి. దాని నుండి అందుకున్న మొత్తంలో సగం మానిటైజ్ చేస్తే కేంద్రం 33 శాతం సాయం ఇస్తుంది.