విధ్వంసకర శక్తుల ఆధిపత్యం తాత్కాలికమే

విధ్వంసక శక్తులు కొంతకాలం మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవని, శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు మానవత్వాన్ని శాశ్వతంగా అణచివేయలేరని తేల్చి చెప్పారు. 

గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయాన్ని గతంలో ధ్వంసం చేసినప్పుడు ఇది నిజమైందని, ఇప్పుడు కూడా నిజమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. శుక్రవారం సోమ్‌నాథ్‌ ఆలయంలోని పలు ప్రాజెక్టులను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుని మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్న సమయంలో మోదీ చేసిన వాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. 

‘విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు, భీభత్సంతో సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు కొంతకాలం ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ వారు మానవత్వాన్ని శాశ్వతంగా అణచివేయలేరు. కాబట్టి వారి ఉనికి ఎప్పటికీ శాశ్వతం కాదు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  ‘సోమనాథ్ దేవాలయాన్ని చాలాసార్లు ధ్వంసం చేశారు. విగ్రహాలను అనేక సార్లు అపవిత్రం చేశారు. ఆలయం ఉనికిని తుడిచిపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ప్రతి విధ్వంసక దాడి తర్వాత ఆలయం పూర్తి వైభవాన్ని సంతరించుకున్నది. మనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని ప్రధాని గుర్తు చేశారు.

అటువంటి వారు మానవాళిని నిరంతరం అణగదొక్కలేరు కాబట్టి వారి ఆధిపత్యం శాశ్వతం కాబోదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, భయోత్పాతం ద్వారా భక్తిని అణగదొక్కడం సాధ్యం కాదని ప్రధాని స్పష్టం చేశారు. మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. సోమ్‌నాథ్ ప్రొమెనేడ్, సోమ్‌నాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీ దేవి దేవాలయం, పాత (జునా) సోమ్‌నాథ్ దేవాలయ ప్రాంగణ పునర్నిర్మాణం ప్రాజెక్టులకు మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. సోమనాథ్ దేవాలయం నవ భారతానికి చిహ్నమని తెలిపారు. 

గడచిన వందల సంవత్సరాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. దీని ఉనికిని అంతం చేయడానికి చేయని ప్రయత్నం లేదని పేర్కొన్నారు. దీనిని పతనం చేయడానికి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ ఇది తిరిగి లేచి నిలబడిందని చెప్పారు. దీనిని సాధ్యం చేసిన సోమనాథ్ ట్రస్ట్ సభ్యులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోమనాధుని భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.