యుపిలో కోటి మంది యువ‌త‌కు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు

రాష్ట్రంలోని కోటి మంది యువ‌త‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు అందించనున్న‌ట్టు  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రాష్ట్ర యువ‌త డిజిట‌ల్ సాధికారిత కోసమే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న చెప్పారు. యుపిలో ఉత్తర ప్రదేశ్ లో యువతకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతటి భారీ పధకాన్ని ప్రకటించలేదు. 

గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం 2017లో 15  లక్షల మంది 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు లాప్ టాప్ లను బహుకరించింది.  గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ లలో  విద్యార్థులకు వీటిని బహుకరింపనున్నట్లు ఆదిత్యనాథ్ ప్రకటించారు. అందుకోసం అనుబంధ బడ్జెట్ ప్రతిపాదనలో 3,000  కోట్లను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

యూపీ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన రూ 7,301 కోట్ల అనుబంధ బడ్జెట్ పద్దులపై జరిగిన చ‌ర్చ‌కు స‌మాధానం ఇస్తూ ఆదిత్యనాథ్ ఈ   ప్రకటన చేశారు. యువతను డిజిటల్ సామర్ధ్యం కలిగించడం కోసం ఎలక్ట్రానిక్ శాఖకు ఈ కేటాయింపులు జరుపుతున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భత్యం సమకూర్చనున్నట్లు కూడా తెలిపారు. మూడు పరీక్షల వరకు ఈ సదుపాయం  అందుబాటులో ఉండగలదని పేర్కొన్నారు. 

 ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర యువ‌త‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని ఆయన విమర్శించారు. దాంతో వారు బ‌ల‌వంతంగా అనైతిక కార్య‌క‌లాపాలకు పాల్ప‌డి జైలు పాల‌య్యేవార‌ని చెప్పారు. కానీ బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్ర యువ‌త అభివృద్ధిని కోరుకుంటున్న‌ద‌ని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై నుండి 28 శాతం సదుపాయం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు ప్రస్తుతం అందజేస్తున్న సాంఘిక భద్రతా మొత్తాన్ని రూ 1. 5 లక్షల నుండి రూ 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి స‌రిగా లేకపోవ‌డంవ‌ల్ల గ‌తంలో రాష్ట్ర యువ‌త‌ ఇండ్ల నుంచి బ‌య‌టికి రావాలంటేనే బ‌య‌ప‌డేవార‌ని, కానీ, ఇప్పుడు దేశంలో ఎక్క‌డికైనా వెళ్తున్నార‌ని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.  తాను యూపీకి చెందిన వ్య‌క్తిని అని గ‌ర్వంగా చెప్పుకుంటున్నార‌ని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మాఫియాలను ప్రోత్సహించేవాని ఆరోపించారు.