విదేశీ ఉగ్రవాదుల ప్రవేశంతో తాలిబన్లలో కలవరం 

ఒక వంక ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం పెచ్చురిల్లుతుండగా, మరోవంక విదేశీ ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించడం వారిలో కలవరం కలిగిస్తున్నది. ఇష్టాను సారంగా నగరాలను వశపరుచుకోవడం, అడ్డొచ్చిన వారిపై కాల్పులు జరపడంతో..స్థానికులు సైతం భయభ్రాంతులకు లోనతున్నారు. 

ఇస్లామిక్ స్టేట్‌, జేషే మొహ‌మ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా లాంటి సంస్థ‌ల‌కు చెందిన ఫైట‌ర్లు ఆఫ్ఘ‌న్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తున్నది. వీరిపై తమకు అదుపు లేకపోవడంతో వారి ఉనికి తాలిబన్ల ఆధిపత్యాన్ని సవాల్ చేయవచ్చని ఆందోళన చెందుతున్నారు. పైగా, వీదేశీ ఉగ్రమూకలను కట్టడి చేసేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం కూడా లేకపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

గ‌త కొన్ని రోజుల నుంచి వాళ్లు దేశంలోకి ప్ర‌వేశిస్తున్నారు. కాబూల్‌లో తాలిబ‌న్ జెండాను ప‌ట్టుకుని తిరిగింది విదేశీ తీవ్ర‌వాదుల‌ని గుర్తించారు. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ప‌లు ఉగ్ర సంస్థ‌ల‌కు చెందిన సాయుధులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలు వాళ్ల ఆధీనంలోనే ఉన్నాయ‌ని అనుమానిస్తున్నారు.

ఇక, వివిధ దేశాలు ఆఫ్ఘన్ తో చేసుకున్న ఆర్ధిక ఒప్పందాలపై ఇప్పుడు వెనుకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా తాము ఆఫ్ఘన్ కు మంజూరు చేసిన అభివృద్ధి గ్రాంట్ ను నిలిపివేస్తున్నట్లు జర్మనీ అభివృద్ధి మంత్రి గెర్డ్ ముల్లర్ ఫినిష్ వెల్లడించారు. సంవత్సరానికి 430 మిలియన్ యూరోలు (506 మిలియన్‌ డాలర్లు) అప్గానిస్తాన్‌కు అందించేందుకు జర్మనీ గతంలో అంగీకరించింది. తద్వారా అతిపెద్ద దాతలలో ఒకటిగా నిలిచింది. 

మరోవంక, అస్థిరత కారణంగా గత దశాబ్దంకు పైగా ఉపయోగంలోకి రాకుండా ఉన్న ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన  లిథీయం నిక్షేపాలపై కూడా తాలిబన్లు పట్టు సాధించారు. దీని విలువ కనీసం 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని గతంలోనే అంచనా వేశారు. 

ఆఫ్గాన్‌ ప్రజలు కూడా ఇతర దేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి దాడులు చేయమని అఫ్గాన్లకు తాలిబన్లు హామీనిచ్చారు. తామిచ్చిన హామీలను కాలరాస్తూ…కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. దొరికిన కాడికి లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరించారు. 

అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. ఇక జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలను తాలిబన్లు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. 

నిజానికి అమెరికాతో జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఎటువంటి ఉగ్ర గ్రూపులను తాలిబ‌న్లు ప్రోత్స‌హించ‌రాదు. అయితే మ‌రికొన్ని రోజుల్లో ఆ ఉగ్ర గ్రూపులు కాబూల్‌ను విడిచి వెళ్తాయ‌ని భావిస్తున్నారు. ల‌ష్క‌రే, జేషే లాంటి సంస్థ‌లు ఒక‌వేళ తాలిబ‌న్ల ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే, అప్పుడు ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మార‌నున్న‌ది.

కాబూల్‌లో ఆ ఉగ్ర‌వాదుల‌కు ఎటువంటి స్థావ‌రం ద‌క్క‌కుండా చూసేందుకు తాలిబ‌న్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాలిబ‌న్ వ్య‌వ‌స్తాప‌కుడు ముల్లా ఒమ‌ర్ కుమారుడు ముల్లా యాకుబ్ ఈ కోణంలో ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నాడు. తాలిబ‌న్ల‌కు, విదేశీ మిలిటెంట్ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ఉగ్ర గ్రూపుల‌ను అణిచివేసేందుకు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేయాల‌ని కొంద‌రు తాలిబ‌న్ నేత‌లంటున్నారు.