ఆఫ్ఘన్ సిఖ్, హిందువులకు తాలిబన్ల భరోసా!

ఆఫ్ఘనిస్తాన్‌లో మైనారిటీ సిక్కు, హిందూ వర్గాల భద్రత, భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, ఆఫ్ఘన్ సిక్కు సంఘం సోమవారం కాబూల్‌లో తాలిబాన్ ప్రతినిధులతో సమావేశం జరిపింది. ఈ సందర్భంగా తాలిబన్లు తమకు శాంతి, భద్రతల గురించి హామీ ఇచ్చిన్నట్లు చెప్పారు.

 ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్సులను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి 280 మంది సిక్కులు, 30-40 మంది  హిందువులతో సహా దాదాపు 300 మంది కార్తె పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్నారని గురుద్వారా దశమేష్ పితా శ్రీ గురు గోవింద్ సింగ్ జీ సింగ్ సభ కార్తా పర్వన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ తెలిపారు.

తాము తమ దేశం నుండి పారిపోవలసిన అవసరం లేదని తమ సమావేశం సందర్భంగా తాలిబన్ల ప్రతినిధులు హామీ ఇచ్చిన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడనే ప్రశాంతంగా జీవనం కొనసాగింప వచ్చని, తాము తమ మతపరమైన ఆచారాలలో ఎటువంటి జోక్యం చేసుకోమని వాగ్దానం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటె సంప్రదించడనైకి ఒక నెంబర్ కూడా ఇచ్చారని తెలిపారు. 

జలాలాబాద్, గజనీలలో నివసిస్తున్న సిక్కు, హిందూ కుటుంబాలు కూడా కాబూల్ చేరుకున్నాయని, వారందరూ ఇప్పుడు కాబుల్ లోని రెండు గురుద్వారాలలో ఆశ్రయం పొందుతున్నారని ఆయన వివరించారు. ఒకప్పుడు లక్ష మందికి పైగా సిక్కులు, హిందువులు ఉన్న దేశంను 1992 లో ముజాహిదీన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ మైనారిటీలు భారీగా వలసలు వెళ్లారు.

తరువాత 1996 లో 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీరిపై దారుణమైన దాడులు జరిగాయి. 2001లో అమెరికా సేనలు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులలో పెద్దగా మార్పు రాలేదు. ముఖ్యంగా జులై 1, 2018 న జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 19 మంది సిక్కులు, హిందువులు మరణించారు.

మార్చి 25, 2020 న- ఇస్లామిక్ స్టేట్ గన్ మాన్ కాబూల్ లోని షోర్ బజార్ లోని గురుద్వారా హర రాయ్ సాహిబ్ లోపలికి దూసుకెళ్లి కనీసం 25 మందిని చంపాడు. అప్పుడు వారిలో కనీసం 400 మంది ఇప్పటికే వివిధ బ్యాచ్‌లలో భారతదేశానికి వలస వచ్చారు. “ఇప్పుడు కేవలం 280 మంది సిక్కులు, కొంతమంది హిందువులు అక్కడ చిక్కుకున్నారు. 2020 గురుద్వారా దాడి తర్వాత దాదాపు 400 మంది ఇప్పటికే ఢిల్లీకి వచ్చారు” అని కార్టే పర్వన్ గురుద్వారా సభ్యుడు,  ఇప్పుడు తన కుటుంబంతో ఢిల్లీలో నివసిస్తున్న ఛబోల్ సింగ్ పేర్కొన్నారు.

అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో సిక్కులు, హిందువులు సురక్షితంగా ఉంటారని, పారిపోవాల్సిన అవసరం లేదని తాలిబాన్ నుండి తాజాగా హామీ లభించినప్పటికీ సిక్కు సమాజంలోని స్థానిక సభ్యులు గతంలోని భయంకరమైన జ్ఞాపకాల కారణంగా తమ మాతృభూమిని విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 

గతంలో తాలిబన్ల పాలనలో   తాలిబాన్ పురుషులు సిక్కుల ముఖాలపై ఉమ్మివేయడం, ఇస్లాం మతం స్వీకరించమని వత్తిడులు తీసుకు రావడం, హిందువులను నుదిటిపై తిలకం ధరించవద్దని స్పష్టం చేయడం, మహిళలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వకపోవడాన్ని మరచిపోలేక పోతున్నారు.

గత తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లోని సిక్కు సమాజం ప్రస్తుతం మౌనంగా ఉన్నప్పుడు, వీలైనంత త్వరగా బయలుదేరే అవకాశం కోసం చూస్తున్నామని వారు చెప్పారు – అది ఇండియా, కెనడా, యుఎస్ లేదా మరేదైనా దేశం.

“ప్రస్తుతం విమానాలను నిలిపి వేయడంతో మాకు ఇక్కడ నివసించడం మినహా ప్రస్తుతం మాకు వేరే మార్గం లేదు. సిక్కుల కోసం, తాలిబాన్ల హయాంలో లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వాల కింద ఆఫ్ఘనిస్తాన్‌లో జీవితం ఎన్నడూ గులాబీల మార్గం కాదు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాలనలో కూడా రెండు దారుణమైన దాడులు జరిగాయి” అని చెప్పారు. 

“ఇప్పుడు మాకు గతంలోని తాలిబాన్ పాలనలో పాత సంఘటనలను లేవనెత్తడం ఇష్టం లేదు.  ఎందుకంటే అది మాకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈసారి తాలిబాన్ తన వాగ్దానాలకు కట్టుబడి ఉంటుందని మేము ఆశిస్తున్నాము” చెబుతున్నా చాలా మంది సిక్కు, హిందూ కుటుంబాలు ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. 

వారంతా తమ సామానులను ప్యాక్ చేసుకొని, భారత్ లేదా మరో దేశం వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.  2020 గురుద్వారా దాడి తర్వాత కొందరు ఢిల్లీకి చేరుకున్నప్పటికీ అక్కడ తగిన జీవనోపాధి లేదా వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు లేక తిరిగి కాబుల్ కు వచ్చామని చెబుతున్నారు. 

మరోవంక, ఆఫ్ఘన్ లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వ‌ర‌గా భారత్ కు  ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఎమ‌ర్జెన్సీ వీసా ప‌ద్ధ‌తిని ప్ర‌క‌టించింది. ఫాస్ట్ ట్రాక్ ప‌ద్ధ‌తిలో భారత్ లో  ఆశ్ర‌యం పొందాల‌నుకునేవారికి ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్నారు. “e-Emergency X-Misc Visaష పేరుతో కేంద్ర హోంశాఖ ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి భార‌త్ చేరుకోవాల‌నుకునేవారికి ఆ వీసా ద్వారా అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే హిందువులు, సిక్కుల‌కు ఈ-వీసాలో తొలి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు.

ఆగస్టు 5 నాటికి అఫ్గానిస్తాన్‌లో అధికారులు సహా సుమా రుగా 1,500 మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది బ్యాంకులు, ఐటీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఆసుపత్రులు, ఎన్జీవో సంస్థలు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ కంపెనీలు, యూనివర్శిటీలు, భారత ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి అనుబంధ మిషన్‌లలో పనిచేస్తున్నారు.