సాహసోపేతంగా కాబుల్ లో ఎంబసీ సిబ్బంది తరలింపు

కాబూల్ భార‌తీయ ఎంబ‌సీలో ఉన్న భార‌తీయ సిబ్బందిని ఖ‌ర్జాయ్ విమానాశ్ర‌యానికి సుర‌క్షితంగా త‌ర‌లించేందుకు పెద్ద ఆప‌రేష‌నే చేప‌ట్టారు. తాలిబ‌న్ల  క‌నుస‌న్న‌ల్లోంచి భార‌తీయ సిబ్బంది బయ‌ట‌ప‌డిన తీరు నిజంగా సాహ‌సోప‌త‌మే. కాబూల్‌ను వ‌శం చేసుకున్న తాలిబ‌న్లు  భార‌తీయ ఎంబ‌సీపై ఓ క‌న్నేశారు. ఎంబ‌సీలో ఉన్న భార‌తీయ సిబ్బందిపై నిఘా పెట్టి ఎటూ వెళ్ల‌కుండా చేశారు.

కానీ ఆ సిబ్బందిని తీసుకువ‌చ్చేందుకు వైమానిక ద‌ళానికి చెందిన రెండు సీ-17 విమానాలు కాబూల్‌కు ఆదివారం రాత్రే చేరుకున్నాయి. ఎంబ‌సీలో ఉన్న సిబ్బందితో పాటు ఇండో టిబెటెన్ బోర్డ‌ర్ పోలీసుల్ని .. ఎంబ‌సీ నుంచి విమానాశ్ర‌యానికి త‌ర‌లించిన తీరు అసాధార‌ణం. ప్రాణాల‌కు తెగించి ఆ సిబ్బందిని విమానాశ్ర‌యానికి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర‌లింపుకు సంబంధించిన కొన్ని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఆగ‌స్టు 15వ తేదీ రాత్రి కాబూల్‌లో ప‌రిస్థితి చేయిదాటిపోయింది. న‌గ‌ర‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది. ఆ గంద‌ర‌గోళంలో  ఎంబ‌సీలో ఉన్న‌వారిని విమానాశ్ర‌యానికి త‌ర‌లించ‌డం పెను ప్ర‌మాద‌మే. భార‌తీయ ఎంబ‌సీపై ప్ర‌త్యేకంగా నిఘా పెట్టిన తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ల‌డం అతి క‌ష్టం. ఇక హై సెక్యూర్టీ ఉండే గ్రీన్ జోన్‌ను దాటి వెళ్లాలంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దుర్భేద్య‌మే. 

సాధార‌ణంగా భార‌త్‌కు వెళ్లే ఆఫ్ఘ‌న్ల కోసం కాబూల్‌లో ఉన్న షాహిర్ వీసా ఏజెన్సీ వీసాలు జారీ చేస్తుంది. ఆ ఏజెన్సీని కూడా తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు త‌నిఖీ చేసిన‌ట్లు తెలుస్తోంది. వైమానిక ద‌ళానికి చెందిన తొలి విమానంలో సోమ‌వారం 45 మంది భార‌తీయుల్ని త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో తాలిబ‌న్లు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద భార‌తీయుల్ని అడ్డుకున్నారు.

తాలిబ‌న్ సెంట్రీలు మ‌న‌వాళ్ల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఎంబ‌సీ ఉద్యోగుల‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ వ‌స్తువుల్ని వాళ్లు లాగేసుకున్నారు. నిజానికి ఆ స‌మ‌యంలో కాబూల్ విమానాశ్ర‌యంలో చాలా భ‌యాన‌క పరిస్థితి నెల‌కొన్న‌ది. విమానాల‌ను ఎక్కేందుకు జ‌నంగా భారీ సంఖ్య‌లో ఎయిర్‌పోర్ట్‌కు ఎగ‌బ‌డ్డారు. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో భార‌తీయ ట్రాన్స్‌పోర్ట్ విమానం క‌దిలిన తీరు న‌మ్మ‌శ‌క్యం కాదు.

విమానాశ్ర‌య రోడ్డు మార్గాన్ని మూసివేయ‌డంతో ఇక మిగితా ఎంబ‌సీ సిబ్బందిని త‌ర‌లించ‌డం అత్యంత ఇబ్బందిక‌రంగా మారింది. విమానాశ్ర‌యం వ‌ద్ద వేల సంఖ్య‌లో జ‌నం ఉండ‌డం వ‌ల్ల ఆ ప్ర‌క్రియ‌కు విఘాతం ఏర్ప‌డింది. కానీ సోమ‌వారం రాత్రి ఆ ప‌రిణామాలు స్వ‌ల్పంగా మారాయి. 

అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో విదేశాంగ మంత్రి జైశంక‌ర్ మాట్లాడిన త‌ర్వాత ప‌రిస్థితులు కుదుట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ త‌ర్వాత భార‌తీయ ఎంబ‌సీ నుంచి సిబ్బందిని కాబూల్ విమానాశ్రయానికి త‌ర‌లింపు సులువైంది. అంబాసిడ‌ర్ రుద్రేంద్ర టండ‌న్‌తో క‌లిపి 120 మంది సిబ్బంది సీ-17 విమానంలో బ‌యలుదేరారు. ఆ విమానం కాసేప‌టి క్రితం గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో ల్యాండ్ అయ్యింది.

అప్ఘనిస్థాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ కాబూల్‌లోని మన దేశ రాయబారిని, సిబ్బందిని తక్షణం వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అందర్నీ సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు హుటాహుటిన చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా ఏఐ244 విమానం 129 ప్రయాణికులను తీసుకుని సోమవారం కాబూల్ నుంచి బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంది.

అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం కాబూల్‌లో రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని తరలించింది.