ఆఫ్ఘన్ లో 3 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసిన భారత్

పరిస్థితులను అంచనా వేయడంతో అమెరికా ఘోరంగా వైఫల్యం చెందడంతో ఆఫ్ఘన్ ప్రజలతో పాటు ఆ  దేశ పుననిర్మాణం కోసం భారీగా వ్యయం చేసిన భారత్ కూడా చిక్కుల్లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో వీటిల్లో కొన్నింటిని  కూల్చడానికి ప్రయత్నించిన తాలిబన్లు ఇప్పుడు ఇవి పూర్తికావడానికి సహకరిస్తారా?

గడిచిన 20 ఏళ్లలో అఫ్ఘన్‌లో పలు ప్రాజెక్టులపై ఇండియా 3 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది.  దానితో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం 2019-20లో జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో కుదిరిన ఒప్పందాలు అమలయ్యేది లేదని తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 

ఈ నిధులతో ఆ దేశంలోని 34 ప్రావిన్సుల్లో మొత్తం 400 పనులను భారత్ చేపట్టింది. వీటిలో చాలా వరకు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నీటి వనరులు పరిమితంగా ఉండే అఫ్ఘనిస్తాన్‌లో 42 మెగావాట్ల జలవిద్యుత్‌ సామర్థ్యంతో సాల్మా జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. ఈ డ్యామ్‌ నీటితో కాబుల్‌ జిల్లాలో రెండు వేల గ్రామాలకు మంచినీటిని అందించే వీలుంది.

90 మిలియన్ డాలర్ల వ్యయంతో అఫ్ఘనిస్తాన్‌ పార్లమెంటు భవనాన్ని భారత్ నిర్మించింది. 2015లో ప్రధానీ నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యంకు  దేవాలయంగా భావించే పార్లమెంట్ భవనాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ వికృత చర్యలు పాల్పడ్డారు. 

ఒక తాలిబన్ ఉగ్రవాది తుపాకీ చేత పట్టి..సభాపతి సీటులో కూర్చున్నాడు. ఇతర తాలిబన్లు ఆ భవనంలో స్వేఛ్చగా, గర్వంగా తుపాకీలు భుజాన తగిలించుకుని పచార్లు చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ప్రముఖ జర్నలిస్టు, సామాజిక వేత్త వజాహత్ ఖాజ్మీ తాజాగా ట్విటర్‌లో షేర్ చేశారు.

19వ శతాబ్ధంలో నిర్మించిన స్టార్‌ ప్యాలెస్‌ పునరుద్ధరణ పనులు భారత్ కు చెందిన ఆగాఖాన్‌ ట్రస్ట్‌ చేపట్టింది.  2013లో పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేసింది. 80 మిలియన డాలర్ల వ్యయంతో కాబూల్‌ జిల్లాలో శతూత్‌ డామ్‌ నిర్మాణానికి భారత్ అంగీకరించింది. ఈ డామ్‌ నిర్మాణం పూర్తయితే ఇరవై లక్షల కుటుంబాలకు తాగునీటి సమస్య తీరిపోయి ఉండేది.

అఫ్ఘనిస్తాన్‌, భారత్ ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య వన్‌ బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని 2019-20లో అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఎంత మేరకు అమలవుతుందనేది సందేహంలో పడింది. ద్వైపాక్షిక ఒప్పందలో భాగంగా అఫ్ఘనిస్తాన్‌ వస్తువులకు భారత్ లో పన్ను రాయితీలు కల్పించారు. 

150 మిలియన్‌ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్‌ – దేలారమ్‌ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ నిర్మించింది. ఈ హైవే నిర్మాణం వల్ల ఇరాన్‌లో ఉన్న చాహబార్‌ పోర్టుతో రోడ్‌ కనెక్టివిటీ ఉంటుందని, గల్ఫ్‌ దేశాలతో పాటు యూరప్‌కి వాణిజ్య మార్గం అవుతుందని భారత్ అంచనా.

పాకిస్తాన్‌తో ఉన్న వైరం కారణంగా అఫ్ఘనిస్తాన్‌ మీదుగా చబహార్‌ పోర్టు ఉండే కనెక్టివిటీ భారత్ కు ఎంతో ఉపయోకరంగా ఉండేది. ఇప్పుడు ఈ హైవే వాడకంపై ఆంక్షలు ఉండవచ్చు. రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా అఫ్ఘనిస్తాన్‌ అధ్యక్ష భవనాన్ని భారత్ నిర్మించించింది. ప్రస్తుతం ఈ భవనం తాలిబన్లు ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్‌ దేశం తరచుగా తన గగనతలంపై ఆంక్షలు విధిస్తోంది. దీని వల్ల విమానయాన రంగంపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు అఫ్ఘనిస్తాన్‌ సైతం ఇలాంటి నిర్ణాయాలు అమలు చేస్తే విమాన ప్రయాణం మరింత దూరభారం, ఆర్థిక భారంగా మారుతుంది.