ఆఫ్ఘనిస్థాన్‌పై మోదీ అత్యున్నత సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం గత రాత్రి జరిగింది, మంగళవారం భారత్ తరలించిన ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ కూడా పాల్గొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో, “సహాయం కోసం భారతదేశం వైపు చూస్తున్న “ఆఫ్ఘన్ సోదర, సోదరీమణులకు” భారతదేశం అన్ని విధాల సహాయాన్ని అందించాలని ఈ సమావేశంలో ప్రధాని చెప్పారు.

తాలిబాన్-పాలిత ఆఫ్ఘనిస్తాన్ వాస్తవికత పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్ ఒక వంక సిద్దమవుతూ ఉండగా, మరోవంక  కాబూల్‌లో తదుపరి పాలనపై ప్రభావం చూపడానికి పాకిస్తాన్, చైనా రెండూ ప్రయత్నిస్తున్న దృష్ట్యా మనం మన వ్యూహాత్మక విధానాన్ని రూపొందించుకోవాలని భావించారు.

“భారతదేశం మన పౌరులను కాపాడటమే కాదు, భారతదేశానికి రావాలనుకునే సిక్కు, హిందూ మైనారిటీలకు కూడా మనం  ఆశ్రయం కల్పించాలి. అలాగే సహాయం కోసం భారతదేశం వైపు చూస్తున్న మన ఆఫ్ఘన్ సోదర సోదరీమణులకు మనం అన్ని విధాలా సహాయాన్ని అందించాలి ” మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

 
సీసీఎస్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

అదే సమయంలో, అఫ్ఘనిస్తాన్‌లో నెలకొనే పరిస్థితుల గురించి “వేచి ఉండాల్సిన పరిస్థితి” ఉన్నప్పటికీ  “కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను గుర్తించడంలో భారతదేశం మొదటి లేదా చివరి దేశం కారాదు” అని ప్రధాని చెప్పిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తదుపరి చర్యలపై ముందుకు సాగడానికి ఢిల్లీ ప్రజాస్వామ్య దేశాలతో సన్నిహితంగా ఉంటుందని సూచించారు.

 
ఆఫ్ఘన్ లోని భారత దౌత్య సిబ్బందిని ఐఎఫ్ సి-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా  కాబూల్ నుండి తరలించడం అమెరికా సహకారంతో జరిగిన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రస్తుతానికి, కొత్త కాబూల్ లో కొత్త ప్రభుత్వ స్వరూపం ఏర్పడే వరకు వేచి ఉండాలని నిర్ణయించారు. అక్కడ వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, “తాలిబాన్‌లలో  ఎవరిని సంప్రదించాలి” అని స్పష్టంగా తెలియదు కాబట్టి, ముందుగా  “వారు ఒక వ్యవస్థను అధికారికంగా నిర్మించనివ్వండి” అని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

అంతర్గత అధికార భాగస్వామ్యం, ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక సమస్యగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాలిబాన్లపై పాకిస్తాన్,  చైనా ప్రభావం కూడా ఆందోళన కలిగించే అంశం, ఎందుకంటే ఇది విస్తరించిన పరిసరాల్లో టెక్టోనిక్ మార్పును సూచిస్తుంది.

భారతదేశం తన విధానంలో పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో జత కలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వారి కధనం ప్రకారం, పాకిస్తాన్ “బలహీనమైన తాలిబాన్”  వ్యవస్థ ఏర్పడితే తాము బలమైన ప్రభావం చూపేందుకు ఇష్టపడుతుంది. చైనా ఆర్ధిక వనరులను పంపింగ్ చేయడం ద్వారా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది.

తాలిబాన్లు తిరిగి రావడంతో పొరుగున ఉన్న ఉగ్రవాదులకు ధైర్యం వచ్చే అవకాశం ఉందని భారత భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి.  ప్రస్తుతం కాశ్మీర్ లోయలో పరిస్థితి అదుపులో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి భారతీయులను అత్యవసరంగా మన దేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, కాబూల్ నుంచి భారతీయులను రప్పించడానికి తీసుకుంటున్న అన్ని చర్యలను ప్రధాని మోదీ సోమవారం రాత్రి వరకు నిరంతరం సమీక్షించారు.

కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందితో విమానం బయల్దేరే వరకు మోదీ నిరంతరం సమీక్షించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భోజనం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీరు ప్రయాణించిన విమానం జామ్‌నగర్‌లో కాసేపు ఆగి, న్యూఢిల్లీకి మంగళవారం ఉదయం చేరుకుంది.