తాలిబాన్ల అకౌంట్లు, సమాచారాన్ని తొలగిస్తున్న ఫేస్‌బుక్

ఆఫ్గనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లకు సోషల్  మీడియా వేదికలైన ఫేస్‌బుక్, వాట్స‌ప్‌, ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇస్తున్నాయి. వారి అకౌంట్లను నిలిపివేశాయి. తాలిబ‌న్ల‌ను, వాళ్ల అకౌంట్ల‌ను, వాళ్ల‌కు సంబంధించిన అనుకూల‌మైన స‌మాచారం మొత్తాన్ని ఫేస్‌బుక్ బ్యాన్ చేసింది.

అఫ్ఘాన్ నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించిన ఫేస్‌బుక్‌  తాలిబ‌న్ గ్రూప్‌తో సంబంధం ఉన్న ప్ర‌తి కంటెంట్‌, అకౌంట్స్ అన్నింటినీ తొల‌గిస్తోంది. అఫ్ఘాన్‌లో మాట్లాడే ద‌రి, పాష్తో అనే భాష‌ల‌కు సంబంధించిన నిపుణులతో ఫేస్‌బుక్ ప‌నిచేస్తోంది. దాని వ‌ల్ల‌ అప్ఘాన్ భాష‌ల్లో పోస్ట్ అయ్యే తాలిబ‌న్ కంటెంట్ మీద కూడా దృష్టి సారించే అవ‌కాశం ఉంటుంది.

తాలిబ‌న్‌ అనేది ఒక ఉగ్రవాద సంస్థ‌. ఆ సంస్థ‌కు సంబంధించిన స‌మాచారం కానీ, అకౌంట్లు కానీ ఫేస్‌బుక్‌లో ఉండ‌టానికి వీలు లేదు. అందుకే తాలిబ‌న్ అనుకూల‌మైన స‌మాచారాన్ని మొత్తం తొల‌గిస్తున్నామని  స్పష్టం చేసింది. అమెరికా చట్టాల ప్ర‌కారం  తాలిబ‌న్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, దానిపై ఆంక్ష‌లు విధించారు. కాబ‌ట్టి తమ సంస్థ  పాల‌సీ ప్ర‌కారం ఆ  సంస్థ‌ను తాము బ్యాన్ చేస్తున్నామని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి మీడియాకు వెల్ల‌డించారు.

ఫేస్‌బుక్‌తో పాటు త‌మ అనుబంధ నెట్‌వ‌ర్క్స్ వాట్స‌ప్‌, ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా తాలిబ‌న్ అకౌంట్ల‌ను బ్యాన్ చేస్తామ‌ని ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. అయితే, తాలిబ‌న్ సంస్థ‌ చాల ఏళ్ల నుంచి సోష‌ల్ మీడియా ద్వారా త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగిస్తున్నది. తాలిబ‌న్లు ప్రత్యేకంగా ఒక వాట్స‌ప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగిస్తున్న‌ట్టు ఫేస్‌బుక్ దృష్టికి వ‌చ్చింది. దానిపై కూడా త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు తీసుకొని, ఆ వాట్స‌ప్ గ్రూప్‌ను తొల‌గిస్తామ‌ని ఫేస్‌బుక్ వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే తాలిబ‌న్ సంస్థ‌కు ప‌నిచేసేవాళ్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా అప్ఘాన్‌ను తాము సొంతం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఫేస్‌బుక్ తీసుకున్న ఈ నిర్ణ‌యం త‌ర్వాత‌ ట్విట్ట‌ర్‌తో పాటు మిగ‌తా సోష‌ల్ మీడియా సంస్థ‌లు కూడా తాలిబ‌న్ కంటెంట్‌పై దృష్టి సారించాయి. తాలిబ‌న్ కంటెంట్‌పై త్వ‌ర‌లోనే మిగితా సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్ కూడా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.