పెట్రోల్ సుంకాల భారం యూపీఏ పుణ్య‌మే!

పెట్రోల్‌, డీజిల్‌ల‌పై దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని  కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ స్పష్టం చేశారు. గ‌తంలో ఇచ్చిన సబ్సిడీల బ‌కాయిల చెల్లింపులే పెట్రోల్ ధ‌ర‌ల త‌గ్గింపున‌కు ఆటంకంగా ఉన్నాయ‌ని ఆమె తెలిపారు. 

రిటైల్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను కృత్రిమంగా త‌గ్గించేందుకు కేంద్ర చ‌మురు సంస్థ‌ల‌కు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్ర‌భుత్వం బాండ్ల‌ను జారీ చేసింద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ఆరోపించారు. స‌ద‌రు ఆయిల్ బాండ్ల‌పై ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం వ‌డ్డీ చెల్లిస్తుంద‌ని ఆమె చెప్పారు. గ‌త ఐదేండ్ల‌లో ఆయిల్ బాండ్ల‌పై రూ.60 వేల కోట్ల వ‌డ్డీ చెల్లించిన‌ట్లు ఆమె  తెలిపారు. ఇంకా రూ.1.3 ల‌క్ష‌ల కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌ని ఆమె పేర్కొన్నారు.

“రూ.1.44 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల‌ను యూపీఏ ప్ర‌భుత్వం జారీ చేయ‌డం వ‌ల్ల పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గాయి. గ‌త యూపీఏ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాదని ముందుకెళ్ల‌లేను. ఆయిల్ బాండ్ల భారం మా ప్ర‌భుత్వంపై ప‌డింది. అందుకే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌లేక‌పోతున్నాం” అంటూ ఆమె తన నిసాహాయతను వ్యక్తం చేశారు. 

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప ప‌రిష్కార మార్గం లేదని ఆమె స్పష్టం చేశారు.  ఇప్ప‌టికైతే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గింపు స‌మ‌స్యే లేదని ఆమె తేల్చి చెప్పారు. 

“యూపీఏ ప్ర‌భుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ల‌కు వ‌డ్డీ చెల్లింపులు ఖ‌జానాకు భారంగా మారాయి. గత ఐదేండ్ల‌లో రూ.62 వేల కోట్ల‌కు పైగా వ‌డ్డీ చెల్లించాం. 2026 వ‌ర‌కు రూ.37 వేల కోట్ల వ‌డ్డీ చెల్లించాలి. బాండ్ల బ‌కాయి ఇంకా రూ.1.3 ల‌క్ష‌ల కోట్లు ఉన్నాయి. ఆయిల్ బాండ్ల భారం లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ల‌పై సుంకాలు త‌గ్గించ‌గ‌లం” అని  ఆర్ధిక మంత్రి వివరించారు.

“మేము గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. గత యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నట్లు” అని నిర్మలా సీతారామన్ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

కాగా, కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలపై రెట్రోస్పెక్టివ్ టాక్స్‌ను తొలగించేందుకు చర్యలు చేపట్టామని ఆర్థికమంత్రి తెలిపారు. నిబంధనలు సిద్ధం చేశామని, త్వరలో అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఈ రెట్రో టాక్స్ చట్టంలో సవరణలకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం వల్ల ఇతర దేశాల కంపెనీలతో పలు సమస్యలు తలెత్తుతుండడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ద్రవ్యోల్బణం నిర్దేశించిన లక్ష్యం పరిధిలోనే ఉందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం అటు, ఇటుగా 2 శాతంతో ఆర్‌బిఐ లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం లక్షం పరిధిలోనే ఉందని మంత్రి తెలిపారు. వచ్చే నెలల్లో మరింత మెరుగవనుందని, అదే సమయంలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను), ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా పెరగనున్నాయని ఆమె వివరించారు.