వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని అటల్‌ సమాధి స్థల్‌లో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. హోం మత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.

ప్రధానిగా పూర్తి పదవీ కాలం పూర్తిచేసిన తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి నిలిచారు. 1924, డిసెంబర్‌ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి.. 2018, ఆగస్టు 16న మృతిచెందారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు.

బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి సుదీర్ఘ అస్వస్థతతో 93 ఏళ్ల వయస్సులో 2018 ఆగస్టు 16న ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. 1996 స్వల్పకాలం ప్రధానిగా కొనసాగగా, 1998, 2004లో మరో రెండుసార్లు ప్రధాని పదవిని చేపట్టారు. డిసెంబర్ 25న వచ్చే ఆయన జయంతిని ‘గుడ్ గవర్నెన్స్ డే’గా జరుపుకొంటారు. 2014లో వాజ్‍‌పేయికి భారతరత్న పురస్కారం లభించింది.

మాజీ ప్రధాని వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయమకమని  ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.చక్కటి వాగ్ధాటి, సుపరిపాలనతో ప్రజల గుండెల్లోతనదైన ముద్రవేసుకున్నారని ట్వీట్‌ చేశారు.

‘భారతరత్న, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. రాజనీతిజ్ఞుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, మేధావి, చక్కటి వాగ్ధాటితోపాటు సుపరిపాలనతో ప్రజల గుండెల్లోతనదైన ముద్రవేసుకున్న వాజ్‌పేయి గారి జీవితం స్ఫూర్తిదాయకం’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య తన టిట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.