మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా 

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆదివారం సమర్పించారు. తనకు మార్గదర్శకత్వం చేసి, అవకాశాలు కల్పించిన సోనియాకు ఆమె ఆ లేఖలో  వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజా సేవలో “కొత్త అధ్యాయం” ప్రారంభించేందుకు సోనియా శుభాకాంక్షలు లభించగలవని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. 

దేవ్ తన ట్విట్టర్ ఖాతాలో ” భారత జాతీయ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు” అని పేర్కొన్నారు. సుస్మితా దేవ్ 2014 నుండి 2019 వరకు లోక్ సభలో అస్సాంలో సిల్చార్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆమె రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన, ఏడు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె.

అస్సాంలో బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే బరాక్ లోయలో ఆ ప్రజలకు కాంగ్రెస్ నేతగా ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బిజెపి గెలిచినప్పుడు, ఎఐయూడీఎఫ్ తో సీట్ల భాగస్వామ్య ఏర్పాటుతో సుస్మితా దేవ్ కలత చెందినట్లు వార్తలు వచ్చాయి. 

సుస్మితా దేవ్ పార్టీని వీడినట్లు వచ్చిన వార్తలను గత మార్చ్ లో కాంగ్రెస్ ఖండించింది. బరాక్ లోయలో ఎఐయూడీఎఫ్ కు ఎక్కువ సీట్లు కేటాయించడానికి ఇష్టపడిన కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు  ప్రదర్శన జరిపారు. కాంగ్రెస్ తో మూడు దశాబ్దాల  అనుబంధాన్ని తెంచుకున్న ఆమె అంతకు ముందు అస్సాంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. 

దేవ్ రాజీనామాపై పార్టీ నేత కపిల్ సిబల్ ట్వీట్ చేశారు: “సుస్మితా దేవ్. మా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యువ నాయకులు వెళ్లిపోతున్నప్పుడు, పార్టీని బలోపేతం చేయడానికి మా ప్రయత్నాలకు ‘వృద్ధులు’గా నిందకు గురవుతున్నాం. “కళ్ళు మూసుకొని” పార్టీ ముందుకు సాగుతుంది”.