గోమాతను రక్షించుకుని ,హిందూ ధర్మాన్ని కాపాడు కోవాలి

గోమాతను రక్షించుకుని, హిందూ ధర్మాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ అయ్యప్ప సేవా సమితి పాదయాత్ర కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. 

50 మంది గో సేవకులు గోవింద మాల ధరించి ఆదివారం హైదరాబాద్‌, హిమాయత్‌నగర్‌లోని టీటీడీ నుంచి తిరుమలకు పాదయాత్రతో బయలు దేరారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరై పాద యాత్రను ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  మన దేశ చరిత్ర చాలా గొప్పదని, ఎంతో మంది త్యాగధనుల పోరాటం, ప్రాణాల బలిదానం ఫలితంగా స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 గడిచినప్పటికీ ఫలాలను ఆస్వాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమయంలో గోవును కాపాడే లక్ష్యంతో జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ పాదయాత్ర చేయడంశుభ పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు,గురుస్వామి బాలకృష్ణ, ప్రతినిధులు జస్మిత్‌ పటేల్‌, దైవజ్ఞశర్మ, శివకుమార్‌, సదానంద్‌ యాదవ్‌, రామకృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.