స్వ‌దేశీ అంటే స్వావలంబ‌న‌, అహింస

స్వ‌దేశీ అంటే విదేశాల‌కు సంబంధించిన ప్ర‌తీది వ‌దులుకోవాల‌ని అర్థం కాద‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ స్పష్టం చేశారు. అంత‌ర్జాతీయ వాణిజ్యం కొన‌సాగాల‌ని, అయితే ఆ వాణిజ్యం మ‌న దేశ ప్ర‌యోజ‌నాలను దెబ్బ‌తీయ‌కుండా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు.  అందుకోసం మ‌నం స్వావ‌లంబ‌న‌ సాధించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని తెలిపారు. 

నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయం డా. హెగ్డేవార్ స్మారక సమితి వద్ద స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకంను ఆవిష్కరిస్తూ స్వావ‌లంబ‌న ఉపాధి సృష్టి జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. స్వావ‌లంబ‌న సాధించ‌క‌పోతే మ‌న ఉద్యోగాలు ఊడిపోతాయ‌ని, దాంతో దేశంలో హింస‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ హెచ్చరించారు.

కాబ‌ట్టి స్వ‌దేశీ అంటే స్వావంబ‌న‌, అహింస అని అర్థ‌మ‌ని ఆయన చెప్పారు. మ‌నం ఇంట‌ర్నెట్‌ను, టెక్నాల‌జీని వాడుతున్నామ‌ని, కానీ మ‌న‌ద‌గ్గ‌ర వాటికి సంబంధించిన అస‌లు టెక్నాల‌జీ లేద‌ని పేర్కొన్నారు. అందుకోసం మ‌నం బ‌య‌టి దేశాల‌పై ఆధార‌ప‌డుతున్నామ‌ని చెప్పారు.

మ‌నం చైనా గురించి మాట్లాడుకుంటాం, చైనా వ‌స్తువులను బ‌హిష్క‌రించాలంటాం.. కానీ మీ మొబైల్ ఫోన్‌ల‌లో వాడే ప్ర‌తీది ఎక్క‌డి నుంచి వ‌స్తుంది..? అని ప్రశ్నించారు. మనం అన్నింటికి చైనా పైనే ఆధార‌ప‌డుతున్నామని గుర్తుచేశారు. 

ఇలా ప్ర‌తి దానికి చైనాపై ఆధార‌ప‌డ‌టం అనేది పెరిగిపోతే భ‌విష్య‌త్తులో మ‌నం వారి ముందు మోక‌రిల్లాల్సి వ‌స్తుంది అని మోహ‌న్ భ‌గ‌వ‌త్‌హెచ్చరించారు. ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉండాలంటే మ‌నం అన్నింటా స్వావ‌లంబ‌న సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్పష్టం చేశారు.