సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ మన రణ నినాదం

సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌.. మన రణ నినాదం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగీస్తూ  శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని కోరారు.

 మనం ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, కానీ విభజన నాటి ఆవేదన ఇప్పటికీ భారతదేశ ఛాతీని చీల్చుతోందని ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. గత శతాబ్దంలో జరిగిన గొప్ప విషాదాలలో ఇది ఒకటని పేర్కొన్నారు. నిన్ననే దేశం భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 ను విభీషణ స్మారక దినంగా గుర్తుంచుకుందామని సూచించారు. 

 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య 25 ఏళ్లకాలం అమృత ఘడియలని, అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలని చెప్పారు. కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదని.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే సాకారం అవుతుందని పేర్కొన్నారు. 

ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగు కీలకమేనని చెబుతూ ఒక్క క్షణం వృథా చేయకుండా ప్రతి పౌరుడు సంకల్ప శక్తితో ముందుకుని నడవాలని పిలుపిచ్చారు. సమస్త పౌరుల భాగస్వామ్యంతో సమృద్ధ భారత నిర్మాణం సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని లక్ష్యాల సాధనకు సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌.. సబ్‌కా ప్రయాస్‌ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. 

ఏడేళ్లలో ఉజ్వల నుంచి ఆయుష్మాన్‌ వరకు అనేక పథకాలు కోట్ల మంది ప్రజల ముంగిట చేరాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సంతృప్త స్థాయికి తీసుకెళ్లాయని, సంక్షేమ, అభివృద్ధి పథకాల హక్కుదారులకు వందశాతం చేరేలా చేయాలని సూచించారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరినీ బ్యాంకులతో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.

ఇంటింటికీ విద్యుత్‌, తాగునీరు ఇంకా సుదూర స్వప్నం కాకూడదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ కరెంటు, తాగునీరు అందించడం మనందరి బాధ్యత అని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లద్వారా సురక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి వివక్షకు తావుండకూడదని ప్రధాని స్పష్టం చేశారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని, ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందాలని చెప్పారు.

దేశాన్ని మహమ్మారి చుట్టుముట్టినప్పుడు టీకాల అభ్యత, భారత ప్రజలకు టీకాలు దొరుకుతాయా? అనుమానం తలెత్తిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందని తెలిపారు. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి సంక్రమణ తక్కువేనని పేర్కొన్నారు.

అయితే, సంక్రమణ తక్కువనేది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదని స్పష్టం చేశారు. మహమ్మారి కట్టడికి క్రమశిక్షణతో కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. మన జీవన శైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంత వరకు రక్షించాయని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 54కోట్ల మందికి టీకా డోసులు అందజేసినట్లు చెప్పారు.

భారతీయులు ఈ యుద్ధంలో (కోవిడ్) చాలా సహనంతో పోరాడారని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల ఫలితంగా నేడు భారతదేశం టీకాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొవిన్‌ యాప్‌ ప్రపంచం దృష్టి ఆకర్షించిందని గుర్తు చేశారు.