8వ సారి ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగురవేసిన మోదీ

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిగా నరేంద్ర మోదీ 8వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశ ప్రజలకు స్వాత్రంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ విభజన గాయాలు నేటికి వెంటాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యసిబ్బందిని ప్రధాని మోదీ కొనియాడారు.

 అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌భట్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. 

ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవారు దేశానికే స్ఫూర్తి అంటూ ప్రధాని అభినందించారు.  

దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని చెప్పారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని మోదీ తెలిపారు.

‘‘భారత అథ్లెట్లు నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌.. మన రణనినాదం కావాలి. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని’’ ప్రధాని మోదీ ప్రజలముందు ఒక సంకల్పం ఉంచారు.