కరోనా నుండి టీకాయే భారీ రక్షణ కవచం 

కరోనా నుంచి టీకాలు మ‌న‌కు భారీ ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తాయ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాధ్ కోవింద్ తెలిపారు. కరోనా ప్రొటోకాల్‌ను అనుస‌రించి అర్హులైన వారంతా స‌త్వ‌ర‌మే టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి శ‌నివారం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ  మ‌హ‌మ్మారి అనుభ‌వం నుంచి మ‌నం ఇంకా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వెల్ల‌డ‌వుతోంద‌ని చెప్పారు. క‌రోనా రెండో వేవ్‌లో మ‌ర‌ణించిన వారికి ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేశారు.

వ్య‌వ‌సాయ మార్కెటింగ్‌లో తీసుకువ‌చ్చిన ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌తో రైతులకు మ‌రింత సాధికార‌త చేకూరింద‌ని ఆయన తెలిపారు. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు రైతుల‌కు మెరుగైన ద‌ర ల‌భిస్తుంద‌ని చెప్పారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల స‌మున్న‌త పోరాటాల‌తోనే భార‌తావ‌నికి స్వాతంత్య్రం సిద్ధించింద‌ని పేర్కొన్నారు. వారి త్యాగాల‌ను మ‌నం స‌దా స్మ‌రించాల‌ని సూచించారు. 

నైపుణ్యాల‌ను క‌లిగిన చిన్నారుల‌ను, కుమార్తెల‌ను గుర్తించి వారు ఉన్న‌త‌స్ధానాల‌కు చేరుకునేలా ప్రోత్స‌హించాల‌ని త‌ల్లితండ్రుల‌కు విజ్ఞప్తి చేశారు. మ‌న ప్ర‌జాస్వామ్యం పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్ధ పునాదుల‌పై నిర్మించ‌బ‌డింద‌ని, పార్ల‌మెంట్‌ను మ‌నం ప్ర‌జాస్వామ్య దేవాల‌యంగా గుర్తెరగాల‌ని హితవు చెప్పారు.

75వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం అందుబాటులోకి రానుండ‌టం మ‌న ప్ర‌జాస్వామ్యంలో అభివృద్ధి ప్ర‌స్ధానానికి నాంది ప‌లుకుతుంద‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మ‌న ప్ర‌జాస్వామ్య దేవాల‌యం కొత్త భ‌వ‌నంలో కొలువుతీర‌డం దేశ ప్ర‌జ‌ల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని రాష్ట్ర‌ప‌తి వ్యాఖ్యానించారు.

‘‘దేశంలో నివసించే వారికే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు గొప్పగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ యేడాది స్వాతంత్య్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవబోతున్నాయి. అమృత మహోత్సవంగా ఈసారి వేడుకల్ని నిర్వహించుకోబోతున్నాం’’ అని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు.

‘‘స్వాతంత్య్ర దినోత్సవం మనకు పండగ దినం. మన స్వాతంత్య్ర  కాంక్ష ఎంతో మంది త్యాగధునల ఫలితం. అందులో మనకు తెలిసినవాళ్లు ఉన్నారు, తెలియని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఈ దేశం కోసం చాలా గొప్ప త్యాగం చేశారు. అలాంటి గొప్ప వీరులకు నా తల వంచి నమస్కరిస్తున్నాను. గత 75 ఏళ్లలో పలు రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగాం. భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది’’ అని రాష్ట్రపతి అభిలాష వ్యక్తం చేశారు.