పరిశ్రమల పద్ధతులు జాతి ప్రయోజనాలకు విరుద్ధం

దేశంలో కొన్ని పరిశ్రమలు అనుసరిస్తున్నవ్యాపార పద్ధతులు, విధానాలు జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ”నేను, నా కోసం, నా కంపెనీ” అన్న ఈ వైఖరికి కొంచెం అతీతంగా మనందరం ఆలోచించాల్సిన అవసరం వుందని సూచించారు. 

”మీలాంటి కంపెనీ, మీరు ఒకటి రెండు విదేశీ కంపెనీలు కొనుగోలు చేసి వుండవచ్చు, కానీ ఇప్పుడు జాతి ప్రయోజనాల కన్నా వాటి ప్రాధాన్యతలు ఎక్కువగా వున్నాయా? అని గోయల్‌ ప్రశ్నించారు. చంద్ర (టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌)కు కూడా ఇదే సందేశాన్ని తెలియచేశానని స్పష్టం చేశారు.

జాతి ప్రయోజనాలే ముఖ్యమైన కొరియా, జపాన్‌లకు టాటా గ్రూప్‌ స్టీల్‌ విక్రయించాలని సవాలు చేస్తున్నా. తమ ప్రభుత్వం జాతీయవాద స్ఫూర్తి గురించి మాట్లాడినప్పుడు మీడియా రంగంలో చాలా మంది మమల్ని సనాతనవాదులుగా, వెనకబడిన వారిగా అభివర్ణిస్తుంటారని మంత్రి విచారం వ్యక్తం చేశారు. అయితే జపాన్‌, కొరియాలో ఎవరూ దీన్ని సనాతన వాదంగా భావించరని గుర్తు చేశారు. 

ప్రభుత్వం-పారిశ్రామిక రంగం మధ్య సమన్వయం కంటే ముందు సీఐఐ, అసోచామ్‌, ఫిక్కీ, పీహెచ్‌డీ చాంబర్స్‌ల మధ్య సమన్వయం ఏర్పడాలని మంత్రి సూచించారు. వినియోగదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనల్లో కొన్నింటిపై టాటా సన్స్‌ అభ్యంతరం తెలపడం తనను బాధించిందని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు తన హృదయాంతరాళాల నుండి వస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ఆయన ప్రసంగం పట్ల పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేయడంతో పాటు, సోషల్ మీడియాలో వివాదాస్పద వాఖ్యలకు అవకాశం కల్పిస్తున్నది.

కానీ, చిన్న వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) మాత్రం మంత్రికి మద్దతుగా నిలిచింది. చిన్న వ్యాపారులకు ప్రయోజనం కల్పించే కొత్త నిబంధనలను టాటా వంటి గ్రూప్‌ వ్యతిరేకించడం దురదృష్టకరమని సీఏఐటీ పేర్కొంది

ఇంతకు ముందు ఈ-కామర్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ)పై ప్రతిపాదించిన కొత్త నియమావళిపై చర్చించేందుకు పారిశ్రామిక  వర్గాలతో ప్రభుత్వం జూలైలో సమావేశమైంది. కొత్త నిబంధనలు తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ సమావేశంలో టాటా సన్స్‌ ఖరాఖండిగా తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వెల్లడించింది.

కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, స్టార్‌బక్స్‌ తదితర విదేశీ భాగస్వామ్య కంపెనీలు తమ షాపింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించడానికి వీలుపడదని టాటా గ్రూప్‌ ఆందోళన వ్యక్తం చేసిందని గత నెలలో రాయిటర్స్‌ కథనం పేర్కొంది. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొనే మంత్రి ఈ విధంగా ప్రసంగించినట్లు తెలుస్తున్నది.