ఇప్పుడా మార్క్సిస్టులకు జాతీయ జెండా గుర్తుకు వచ్చింది!

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో కమ్యూనిస్టులు దేశంలో ఏనాడు తమ కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగరవేయనే లేదు. మన జాతీయ గౌరవానికి సంబంధించిన చిహ్నాలు, సందర్భాలను వారెప్పుడు గౌరవించనే లేదు. చివరకు స్వతంత్ర పోరాటాల్లో సహితం మన జాతీయ వీరులకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులతో చేతులు  కలిపిన చరిత్ర వారిది. 
 
చాలాకాలం మనం స్వాతంత్య్రం పొందడాన్ని కూడా గుర్తించడానికి తిరస్కరించారు. కేవలం `అధికార మార్పిడి’ మాత్రమే జరిగినదని, స్వాతంత్య్రం అనేడిది భూటకమని వాదిస్తుండేవారు. ఆ తర్వాత స్వాతంత్య్రం పట్ల ఈ వాదనను మార్చుకున్నా, జాతీయ జెండాలను ఎగురవేసే ప్రయత్నం చేయలేదు. 
 
అందుకనే క్రమంగా దేశ ప్రజలకు దూరం అవుతూ ఉండడం, వారి సైద్ధాంతిక దివాళాకోరుతనం బైటపడుతూ ఉండడం, రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడుత  ఉండడంతో  ఇప్పుడు భారతీయుల మనోభావాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. దేశ వ్యాప్తంగా, కమ్యూనిస్టుల చరిత్రలో మొదటిసారిగా, అన్ని పార్టీ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేయాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. 
 
కేరళలో వామపక్షాలు కృష్ణాష్టమి ఉత్సవాలు, రామాయణంపై ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు 34 ఏళ్లపాటు తిరుగులేని రాజకీయ అధికారం చెలాయించిన పశ్చిమ బెంగాల్ లో ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెల్చుకోలేక బోర్లాపడిన మార్క్సిస్టులు ఆగష్టు 15న తమ పార్టీ కార్యాలయాలపై జాతీయ పతాకాలను ఎగురవేస్తున్నారు. 
 
సిపిఎం పశ్చిమ బెంగాల్ యూనిట్ ప్రతిపాదనపై కేంద్ర కమిటీ అయిష్టంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నది.  అయితే ఆలస్యంగా తాము చేపడుతున్న దిద్దుబాటు చర్య అనే విమర్శలను సిపిఎం రాష్ట్ర నాయకత్వం ఖండిస్తున్నది. దేశంలో ప్రమాదం అంచుకు చేరుకున్న ‘భారతదేశ ఆలోచన’ కోసం సంవత్సరంపాటు తాము చేబడుతున్న పోరాడటానికి ప్రతిజ్ఞగా జాతీయ  జెండాను ఎగురవేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆ పార్టీ ఎదుర్కొంటున్న సైద్ధాంతిక, రాజకీయ సంక్షోభాన్ని వారి మాటలలో కలవరం వెల్లడి చేస్తున్నది. దేశంలో ఒక ప్రక్క కమ్యూనిస్ట్ భావజాలంకు కాలం చెల్లుతుండగా, ఆర్ ఎస్ ఎస్, బిజెపి ఆలోచనలకు మద్దతు పెరుగుతూ ఉండడం, చివరకు తమకు కంచుకోటలుగా భావించే పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాలలో సహితం వారు కీలక భాగస్వాములవుతూ తమను పక్కకు నెట్టివేయడంతో వారిలో ఖంగారు ఏర్పడినట్లున్నది.
అందుకనే `హిందుత్వ ఆలోచన’కు పెరుగుతున్న మద్దతును వారు `భారతదేశ ఆలోచన’కు కలుగుతున్న ప్రమాదంగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. భారత స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి రాబోయే సంవత్సరకాలం పాటు ప్రజలకు తెలియచెప్పాలని కూడా నిర్ణయించారు. జాతీయత భావనతో వ్యాపిస్తున్న బిజెపిని `ఫాసిస్ట్ శక్తీ’గా ప్రచారం చేస్తున్న సిపిఎం తామే `నిజమైన జాతీయవాదులం’ అని చెప్పుకోవడానికి ఇప్పుడు విఫల ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.
అయితే ప్రజలు తమను స్వతంత్రపోరాటంలో పలు పర్యాయాలు `వెన్నుపోటు’ పొడిచిన వారుగా భావిస్తున్నారనే ఆందోళన వారిలో ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో గాని, నేతాజీ విషయంలో గాని దేశ ప్రజలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వారితో చేతులు కలిపినా వారా స్వతంత్ర పోరాటం గురించి మాట్లాడేది? 
జాతీయ జెండా వారికి ఎన్నడూ బెంగాల్ లో 34 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు. 2011లో అధికారం కోల్పోయిన గత పదేళ్లలో కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. స్వతంత్ర పోరాట అనుభవాల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా `భారతదేశ భావన’ కు ప్రమాదం ఏర్పడినది వారు బయలుదేరడం గమనిస్తే వారి ఉనికికి ముప్పు ఏర్పడినట్లు వారిలో చెలరేగుతున్న ఆందోళన వెల్లడి అవుతుంది.
 
2021 అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ లో సిపిఎం పతనానికి పరాకాష్ట.  తృణమూల్ కాంగ్రెస్‌ను బిజెపితో సమానంగా చూపే ప్రయత్నం చేస్తూ ‘బిజెమూల్’ తమ ప్రధాన విరోధి అంటూ ప్రచారం చేశారు. అయితే వారి ప్రచారాన్ని బెంగాల్ ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు `భారతదేశం ఆలోచన’ వారికి గుర్తుకు రావడం, త్రివర్ణ పతాకంలను ఎగురవేయడం ద్వారా ఈ భావనను కాపాడాలను పూనుకోవడం వారి విఫలమైన నాయకత్వపు నీచమైన రాజకీయ భావజాలాన్ని వెల్లడి చేస్తుంది.
5 కన్నా తక్కువ శాతం ఓట్లు పొందడం ద్వారా ఆ పార్టీ ఇప్పుడు బెంగాల్ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన్నట్లు స్పష్టం అవుతున్నది. భారత జాతీయ జెండాను గౌరవించకుండా స్వతంత్రం వచ్చిన సమయంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఘోరమైన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారా?
ఇటువంటి దిద్దుబాటు చర్యలు ఎన్నికలకన్నా ముందు ప్రారంభించి ఉంటె కొంత ప్రయోజనం కలిగి ఉండెడిది ఏమో! అంతా అయిపోయిన తర్వాత ఏదో పట్టుకున్నట్లు వారి వ్యవహారం ఉన్నది. అంతర్గతంగా తమ పార్టీలో సైద్ధాంతికంగా పెరుగుతున్న చీలకల ప్రభావం కూడా ఈ సందర్భంగా పార్టీ నిర్ణయంపై ఉన్నట్లు భావించవలసి వస్తున్నది. 
 
సిపిఎంలో నిరుత్సహ వాతావరణం తీవ్రంగా ఉంది. పార్టీ విధానాలలో గందరగోళ సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీని పునర్నిర్మించడం తప్ప ఈ వ్యాధికి చికిత్స లేదని పార్టీలో అనుభవజ్ఞులు భావిస్తున్నారు. పార్టీ నాయకత్వపు అనాలోచిత విధానాల కారణంగానే ప్రస్తుత పతనావస్థ ఎదురైనదని గ్రహించారు. పార్టీకి పట్టుకొమ్మలైన సామాన్య ప్రజలకు నాయకత్వం దూరమైనది. 

దేశంలో సిపిఎంకు మణికిరీటం వలే సుదీర్ఘకాలం వెలుగొందిన పశ్చిమ బెంగాల్ నాయకత్వంలో ఉద్భవించిన లోపాలను సాధారణ ఓటర్లు, ప్రజలకు చాలాకాలంగా గ్రహిస్తున్నా పార్టీ నాయకత్వంలోనే కనువిప్పు కలగడం లేదు. పార్టీ నాయకులు ప్రజల పక్షాన కాకుండా, అధికారులవలే  మారి ప్రజలను ఆదేశిస్తూ ఉండడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఒక పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు.

సిపిఎం తన పునరుజ్జీవన ప్రణాళికలను తన ఇమేజ్‌ని లేదా కొంతమంది ఇమేజ్‌ని పెంచే షార్ట్‌కట్‌లను కనుగొనడానికి పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. దశాబ్దాలుగా నిర్మించడానికి పని చేసిన రాజకీయ మూలధనం దాదాపు పూర్తిగా చెరిగిపోయింది. దానితో ఇప్పుడు కాంగ్రెస్‌తో అసమర్థమైన భాగస్వామ్య సంబంధంలో అరువు తెచ్చుకున్న రాజకీయ మూలధనంతో ఇది పనిచేస్తోందని చెప్పవచ్చు.