అమరరాజా చెన్నైకు తరలింపు వదంతి మాత్రమే

చెన్నైకు అమరరాజా తరలింపు అనేది వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ, అమరరాజా గ్రూప్‌ సంస్థల నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న గల్లా జయదేవ్‌ ప్రకటించారు. గత నెల రోజులుగా పత్రికలు, చానళ్లలో తమ కంపెనీ గురించి ఒక వార్త వస్తోందని, మంచైనా చెడైనా ఇంతవరకూ దానిపై తాము స్పందించలేదని తెలిపారు.

వ్యవస్థాపక చైర్మన్‌ గల్లా రామచంద్ర నాయుడు కుమారుడిని చైర్మన్ గా ప్రకటిస్తూ తనకు వయోభారం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డ తాను తన తండ్రి గల్లా గంగులయ్య, తన మామ పి.రాజగోపాలనాయుడు సూచన మేరకు పల్లె ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో భారతదేశానికి వచ్చానని పేర్కొన్నారు.

తిరుపతి – కరకంబాడి సమీపంలో రూ. రెండుకోట్ల పెట్టుబడితో 22 మంది ఉద్యోగులతో 1985లో అమరరాజా సంస్థను ప్రారంభించానని, బ్యాటరీల తయారీలో అంచెలంచెలుగా ఎదుగుతూ స్వదేశీనే కాకుండా విదేశీ మార్కెట్‌లోనూ పోటీ పడుతోందని తెలిపారు. ఇప్పటివరకూ 15 ప్లాంట్ల విస్తరణ జరిగిందని చెప్పారు.

తాము పెట్టిన ప్లాంట్లన్నీ పల్లె ప్రాంతాల్లో సాగుకు యోగ్యం కాని భూమిలోనే ఏర్పాటుచేశామని చెబుతూ ఇప్పటివరకు ఆరువేల కోట్ల పెట్టుబడులతో ఎనిమిదివేల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా రాజన్న ట్రస్టు ఆధ్వర్యంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాగా, తమ పరిశ్రమ చెన్నరుకి తరలిపోతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

కాగా, తమ ఫ్యాక్టరీ కాలుష్యం విరజిమ్ముతున్నట్లు ప్రభుత్వంలోని కొందరు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతామని జయదేవ్ స్పష్టం చేశారు.  కోర్టు నిర్ణయం తర్వాత స్పందిస్తామని తెలిపారు.  జగన్‌ సర్కారు ‘రాజకీయ కక్ష’ను భరించలేక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరిగింది.

ప్లాంటును చెన్నైకి తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కధనాలు వెలువడ్డాయి. అమరరాజా బ్యాటరీస్‌ మూసివేతకు ఏపీ సర్కారు కంకణం కట్టుకున్నట్లు బయటకి పొక్కడంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ నుంచి గల్లా జయదేవ్‌కు వర్తమానం వచ్చినట్లు తెలిసింది.

‘‘మధ్యవర్తులు ఎవరూ అక్కరలేదు. మీకు అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా రాష్ట్రానికి రండి. అన్ని వసతులు కల్పిస్తాం. ఇప్పుడు మీకున్న సదుపాయాలకంటే ఎక్కువే ఇస్తాం. ఇక మీదే ఆలస్యం’’ అని స్టాలిన్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది.

మరోవంక,  అమరరాజా బ్యాటరీస్‌ చిత్తూరు జిల్లా నుంచో, రాష్ట్రం నుంచో వెళ్లిపోవాలని కోరుకోవడంలేదని చిత్తూర్ జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రానికి ఆర్థికంగా లాభం చేకూర్చి, ఎందరో నిరుద్యోగులకు ఉపాధి చూపే పరిశ్రమలు ఇక్కడే ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రభుత్వ నిబంధనలను పరిశ్రమలు పాటించాల్సిన అవసరం ఉంటుంది’’ అని చెప్పారు.