బండి సంజయ్ పాదయాత్ర ‘ప్రజా సంగ్రామ యాత్ర’

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుండి చేపట్టదలచిన పాదయాత్రకు `ప్రజా సంగ్రామ పాదయాత్ర’ అనే పేరును ఖరారు చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ పేరును అధికారికంగా బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్రకటించారు.
ఈ నెల 24వ తేదీన ఉదయం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభిస్తారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాత్రను కొనసాగిస్తారు. ఈ నెల 9 నుంచే పాదయాత్ర చేయాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పాదయాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
 
విడతల వారీగా ఈ పాదయాత్ర బండి సంజయ్ నిర్వహించనున్నారు. మొదటి విడతగా ఈ నెల 24వ తేదీ నుండి యాత్ర ప్రారంభం కానుది. హుజురాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకుని తొలి విడత పాదయాత్ర ఈ రూట్ గుండా సాగనుంది. మొదటి విడత యాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరో విడత యాత్రను బండి సంజయ్ నిర్వహించనున్నారు. 
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నియంత్రుత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఈనెల 24నుండి చేపట్టబోయే ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతి ఒక్క కార్యకర్త హాజరవుతారని రాజాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు.
బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేస్తామని, కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్రకు భారీ ఎత్తున కార్యకర్తలు, జనం తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2023 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర సాగుతుందని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఈ పాదయాత్రలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. తెలంగాణను అడ్డుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్‌ను పెట్టారని రాజాసింగ్ విమర్శించారు. అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ సిగ్గు లేకుండా సంతల్లో పశువుల్లా కొంటున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ అభివ్రుద్దికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే దళిత బంధు పేరిట హుజూరాబాద్ లో వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని చెప్పారు.

తన నియోజకవర్గంసహా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, పేదలు ఉన్నారని వారికోసం ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు. తన నియోజకవర్గ ప్రజలకు వందల కోట్ల రూపాయల దళిత బంధు నిధులు వస్తాయంటే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజాసింగ్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాజాసింగ్ తోపాటు పాదయాత్ర కమిటీ ప్రముఖ్, పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి జయశ్రీ, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు పాల్గొన్నారు.