తమ కుటుంభంకు ప్రాణహాని అంటున్న వైఎస్ సునీత 

తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇందుకు రెక్కీ కూడా నిర్వహించారంటూ దిగవంత మాజీ  వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వై ఎస్ సునీత  తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ మేరకు కడప ఎస్పీకి ఆమె లేఖ రాశారు. ఈ హత్యకేసులో సిబిఐ దూకుడుగా ముందుకు వెడుతూ ఉండడంతో ఒక కొలిక్కి వస్తున్నట్లు అందరు భావిస్తున్న తరుణంలో ఆమె ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు.
అతను రెక్కీ నిర్వహించడం సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానుతుడిని గుర్తించామని పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ డిజీపి, సిబిఐ అధికారులకు కూడా సునీత లేఖలు పంపారు. ఆమె తన  లేఖలతోపాటు.. సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు.
జగన్ సన్నిహితుడిని విచారించిన సిబిఐ 
మరోవంక,  వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైనా సీబీఐ అధికారులు దృష్టి సారించింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. అతను వైసిపి రాష్ట్ర కార్యదర్శి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు శివశంకర్‌ రెడ్డిని పలు అంశాలపై ప్రశ్నించారు. గతంలో సిట్, సీబీఐ బృందాలు సైతం శివశంకర్ రెడ్డిని విచారించాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను సైతం సీబీఐ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సుమారు పది వారాలుగా సుధీర్ఘంగా కొనసాగిస్తున్న విచారణలో కీలక ఆధారాలను సైతం సేకరించారు.
వివేకాహత్య కేసులో ప్రధాన అనుమానితునిగా ఉన్న శంకర్‌రెడ్డితోపాటు, పులివెందుల క్యాంప్‌ కార్యాలయంలో పనిచేసే రఘునాథరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు సంబంధించిన వివిధ అంశాలపై సీబీఐ అధికారులు వారిని ఆరా తీస్తున్నారు.