‘వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ’ ఓ మైలురాయి

`వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ’ని ప్రకటిస్తూ దేశాభివృద్ధి ప్రస్థానంలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత, స్టార్టప్స్ చేరాలని ఆయన కోరారు. ఇది చెత్త నుంచి సంపదను సృష్టించే పధకమని ఆయన చెప్పారు.

ఈ విధానాన్ని స్వచ్ఛంద ఈ పాలసీని వాహనాల ఆధునీకరణ కార్యక్రమం అని కూడా  పిలుస్తున్నారు. గుజరాత్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో పాల్గొంటూ భారత దేశ అభివృద్ధి ప్రస్థానంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ గొప్ప మైలురాయి అని చెప్పారు.

ఈ తుక్కు పాల‌సీ రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను తీసుకురానున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా మోదీ చెప్పారు. గుజ‌రాత్‌లోని అలంగ్ ఈ వాహ‌నాల తుక్కుకు హ‌బ్‌గా మార‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు. వెహికిల్ స్క్రాపింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం గుజరాత్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సు విస్తృత అవకాశాలను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉపయోగించడానికి యోగ్యత కోల్పోయిన వాహనాలను, కాలుష్య కారక వాహనాలను పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో తొలగించడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందని పేర్కొన్నారు.

వాహనాలను స్క్రాప్ చేయడం వలన పర్యావరణ అనుకూలమైన రీతిలో అనర్హమైన, కాలుష్యం కలిగించే వాహనాలను తొలగించడానికి సహాయపడుతుందని ప్రధాని తెలిపారు. ఈ విధానం కాలుష్యాన్ని తగ్గిస్తుందని, ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, కొత్త వాహనాల డిమాండ్‌ని పెంచుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

రహదారుల నుండి అనర్హమైన వాహనాలను తొలగించడంలో, ఆటో సెక్టార్‌లో మాత్రమే కాకుండా అన్ని రంగాలలో సానుకూల మార్పును తీసుకురావడంలో ఇది భారీ పాత్ర పోషిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి పరిశుభ్రమైన, రద్దీ లేని,  సౌకర్యవంతమైన కదలిక అవసరం కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని ప్రధాని వివరించారు.

ఈ విధానం సర్క్యులర్ ఎకానమీలో ఒక ముఖ్యమైన భాగం అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ఇది నగరాల నుండి కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరియు వేగవంతమైన అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రతిబింబిస్తుందని తెలిపారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్‌నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయని తెలిపారు. వాహనం వయసునుబట్టి కాకుండా, దాని ఫిట్‌నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందని చెప్పారు. ఈ తుక్కు పాల‌సీ కార‌ణంగా ముడి స‌రుకుల ధ‌ర‌లు 40 శాతం వ‌ర‌కూ త‌గ్గుతాయ‌ని గ‌డ్క‌రీ పేర్కొన్నారు.

ఆటోమొబైల్ త‌యారీలో భారత్  ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా మారుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.

సామాన్యుడికి మేలు చేస్తుంది

పాత కారును స్క్రాప్ చేయడంపై ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది, ఇది కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది. వాహన యజమానులు రహదారి పన్నుపై డిస్కౌంట్‌తో సహా పాత వాహనాన్ని స్క్రాప్ చేయడానికి ప్రోత్సాహకంగా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. పాత కారు నిర్వహణ వ్యయం, మరమ్మత్తు ఖర్చు,  ఇంధన సామర్థ్యంపై ఒక వ్యక్తి డబ్బు ఆదా చేస్తాడు.

వాహన యజమానులు టైర్లు వంటి పని చేయగల భాగాల కోసం కారు స్క్రాపేజ్ కోసం ఉత్తమ ధరను కూడా పొందవచ్చు. కొత్త అధునాతన వాహనాలు తులనాత్మకంగా సురక్షితంగా ఉంటాయి. ఉదాహరణకు, కొత్త కార్లు అత్యున్నత భద్రతా లక్షణాలతో వస్తాయి. పాత‌, కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న త‌మ వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చ‌డానికి ముందుకు వ‌చ్చే య‌జ‌మానుల‌కు ఈ కొత్త విధానం కార‌ణంగా ల‌బ్ధి క‌ల‌గ‌నుంది.

ఈ విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబ‌డిన‌ వాణిజ్య వాహ‌నాలు, 20 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తిగ‌త వాహ‌నాలను తుక్కు చేయాల్సి ఉంటుంది. మొద‌ట ఈ విధానాన్ని ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు అమ‌లు చేయ‌నుండ‌గా.. ఆ త‌ర్వాత భారీ వాణిజ్య వాహ‌నాలు, వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు అమ‌లు చేస్తారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లోగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర ఉన్న 15 ఏళ్లు పైబ‌డిన వాహ‌నాల‌ను తుక్కుగా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌ను 2024 జూన్ నుంచి తుక్కు కింద మ‌ల‌చ‌నున్నారు.