చైనాను కాపీ కొడుతూ భారత్ ఎదగలేదు

చైనాను కాపీ కొడుతూ ప్రపంచ తదుపరి కర్మాగారంగా భారత్‌ ఎదగలేదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశాన్ని కాపీ కొట్టొద్దంటూ కాంత్‌ భారతీయ పరిశ్రమకు హితవు పలికారు.

గ్లోబల్‌ లీడర్‌గా అవతరించాలనుకుంటే వృద్ధికి వీలున్న రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ ఈ ఏడాదికిగాను వర్చువల్‌గా నిర్వహించిన వార్షిక సమావేశంలో కాంత్‌ పాల్గొంటూ భారతీయ ప్రైవేట్‌ రంగం తమకు తాము గొప్ప లక్ష్యాలనుని పేర్కొన్నారు. 

ముఖ్యంగా గ్రీన్‌ హైడ్రోజన్‌, హై-ఎండ్‌ బ్యాటరీలు, అడ్వాన్స్‌డ్‌ సోలార్‌ ప్యానెల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. పునరుత్పాదక శక్తి రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు గొప్ప కంపెనీలున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

కాగా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉన్నదని ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ఆయా రాష్ర్టాలు విధించిన ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో జీడీపీ తిరిగి కోలుకుంటున్న సంకేతాలున్నాయని చెప్పారు. 

ప్రగతి కోసం పరిశ్రమకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తాం. అయితే పెట్టుబడులకు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమ దన్నుగా నిలవాలని ఆమె సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతంతో పోల్చితే 37 శాతం పెరిగాయి. దేశీయ ఫారెక్స్‌ నిల్వలు సైతం ఈ ఏడాది జూలై నాటికి 620 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆమె వివరించారు. 

పురోగమనంలో పారిశ్రామికోత్పత్తి 

ఇలా ఉండగా, తయారీ, మైనింగ్‌, విద్యుత్‌ రంగాల తోడ్పాటుతో దేశ పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండో నెలలో వృద్ధిచెందింది. ఈ ఏడాది జూన్‌ నెలలో గతేడాది ఇదేనెలతో పోలిస్తే పరిశ్రమల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధిచెందింది. 2020 జూన్‌లో కరోనా సంక్షోభంతో 16.6 శాతం క్షీణించిన కారణంగా లో బేస్‌ ఎఫెక్ట్‌తో ఈ జూన్‌లో వృద్ధి సాధ్యపడింది. 

2021 మే నెలలో ఈ వృద్ధి 28.6 శాతం. పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) 2020 జూన్‌లో 107.9 పాయింట్లుకాగా, తాజాగా ముగిసిన జూన్‌ నెలలో 122.6 పాయింట్లు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జూన్‌లో ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన తయారీ రంగం ఉత్పత్తి 13 శాతం పెరిగింది. 

మైనింగ్‌ రంగం 23.1 శాతం, విద్యుదుత్పత్తి 8.3 శాతం చొప్పున వృద్ధిచెందాయి. తయారీ రంగంలో ఉప విభాగాలైన క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 25.7 శాతం పెరగ్గా, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ తయారీ 30.1 శాతం పెరిగింది. కన్జూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌ ఉత్పత్తి మాత్రం 4.5 శాతం క్షీణించింది. కరోనా రెండో వేవ్‌ సందర్భంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్లు జూన్‌ నెలలో క్రమేపీ సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

తగ్గుముఖం పట్టిన ఆహార పదార్ధాల ధరలు 

వరుసగా రెండు నెలలుగా పెరుగుతూ వచ్చిన ఆహార పదార్థాలు తగ్గుముఖం పట్టడంతో జూలై నెలకుగాను రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠ స్థాయి 5.59 శాతానికి చేరుకున్నది. జూన్‌లో 6.26 శాతంగా ఉన్న ధరల సూచీ ఏడాది క్రితం ఇదే నెలలో 6.73 శాతంగా ఉన్నది. 

గత నెలలో ఆహార పదార్థాల ధరల సూచీ 5.15 శాతం నుంచి 3.96 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడించింది. కూరగాయల ధరలు మైనస్‌ 7.75 శాతానికి పడిపోగా, పప్పుదినుసులు 9.04 శాతానికి దిగొచ్చాయి. కానీ, మాంసం, చేపలు, కోడిగుడ్లు, పాల ధరల సూచీ మాత్రం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉం టుందని ఆర్బీఐ అంచనా.