మహిళా శక్తీ ఎటువంటి మార్పునైనా తీసుకు రాగలదు

కృతనిశ్చయంతో తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటె ‘నారీ శక్తి’ (మహిళా శక్తి) ఎటువంటి మార్పునైనా తీసుకురాగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక మహిళ సాధికారత పొందినప్పుడు, ఒక కుటుంబం మాత్రమే కాకుండా  సమాజం, దేశం కూడా సాధికారికత పొందుతాయని ఆయన స్పష్టం చేశారు. 

ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్‌లో భాగంగా ఆయన స్వయం సహాయక సంఘాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ ఎచ్ జి సభ్యుల విజయ కథల సంకలనం, వ్యవసాయ జీవనోపాధిని విశ్వవ్యాప్తం చేయడంపై ఒక హ్యాండ్‌బుక్‌ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. 

స్వయంసహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్న దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా  గ్రామీణ పేద కుటుంబాలను స్వయం సహాయక బృందాలుగా దశలవారీగా సమీకరించడం, వారి జీవనోపాధి వైవిధ్యభరితం, వారి ఆదాయాలు మెరుగుపరచడం, వారి జీవితపు నాణ్యతను మెరుగు పరచడానికి వారికి దీర్ఘకాలిక మద్దతు అందించడం జరుగుతున్నది. .

మహిళలు ఆర్థికంగా స్వయం సాధికారత సాధించేలా కృషి చేయడంలో గత ప్రభుత్వాలు కొన్నేళ్లుగా విఫలమయ్యాయని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వ విచక్షణతో సుస్థిరంగా ఈమేరకు స్వయం సహాయక సంఘాలు పురోగతి సాధించ గలవని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సంఘాలు గ్రామాల పురోగతిలో ఈ సంఘాలు కీలక పాత్ర వహించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈమేరకు 4 లక్షల మహిళా సంఘాలకు రూ.1,625 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఇంతేకాకుండా ఈ సంఘాల సభ్యులు దాదాపు 7500 మందికి రూ. 25 కోట్ల మూలనిధి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద తొలి విడతలో 75 మహిళా రైతు సంఘాలకు రూ. 4.13 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. 

మన సోదరీమణులకు, కుమార్తెలకు విద్య, ఆరోగ్యం, పోషణ, వ్యాక్సినేషన్ ఇతర అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని ప్రధాని చెప్పారు. మాస్కులు, శానిటైజర్లు తయారీ, ఆహార సరఫరా, అవగాహన పెంపొందించడం ఇలా ప్రతిదానిలో శక్తి గ్రూపుల సేవ అసమానమైనదని ప్రధాని ప్రశంసించారు.

గత ఆరేడు సంవత్సరాలుగా మహిళా స్వయం శక్తి గ్రూపుల ఉద్యమం ఊపందుకుందని, అలాంటి 70 లక్షల గ్రూపులతో 8 కోట్ల మంది మహిళలు అనుసంధారమవుతున్నారని వివరించారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలు కొన్నేళ్లుగా చూపించిన అశ్రద్ధను విమర్శిస్తూ తమ ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లు లేని కొన్ని కోట్ల మంది మహిళలకు బ్యాంకింగ్ వ్యవస్థను అనుసంధానిస్తూ జనధన్ అకౌంట్లు ప్రారంభమయ్యేలా పెద్ద ఉద్యమం ప్రారంబించామని గుర్తు చేశారు

ఈ స్వయం సహాయక మహిళా సంఘాలకు ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణ సాయాన్ని రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద స్వయం సహాయక మహిళా సంఘాల విజయ గాధల సంకలనం, వ్యవసాయ జీవనోపాధి సార్వత్రికీకరణ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.