ఏటా రూ 50 కోట్ల తిరుమల నిధులకై ఆర్డినెన్సు!

రోజువారీ అవసరాలకోసం కూడా నిధులకోసం ఇబ్బంది పడుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు అప్పులు పుట్టడం సహితం గగనమైపోతూ ఉండడంతో, ఇప్పుడు  ఎక్కడ పడితే అక్కడి నుండి నిధులను కైవసం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నది. మొదటి నుండి ప్రపంచంలోనే వాటికన్ తర్వాత సంపన్నమైన దైవ క్షేత్రమైన తిరుమలపై ప్రభుత్వం దృష్టి పడుతూ వస్తున్నది. 
 
తిరుమల భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ప్రజా నిరసనతో వికటించాయి. స్వామివారి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి ప్రభుత్వం అప్పులు తీసుకొనే ప్రయత్నం ఒక వంక చేస్తూ, మరోవంక అధికారికంగా ప్రతి ఏటా రూ 50 కోట్ల మేర టిటిడి నిధులు ప్రభుత్వంకు దక్కేటట్లు ఆర్డినెన్సు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
టీటీడీ నుంచి ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 కోట్లు మాత్రమే వస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం అంటూ బడ్జెట్‌లో రూ.234 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆలయాల కోసం నేరుగా ప్రభుత్వం నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అంటూ భారీఎత్తున  ప్రచారం చేసుకుంది.

కానీ, ఏడాది ముగిసినా ఆ నిధులను విడుదల చేయలేదు. అనంతరం 2020-21, 2021-22 బడ్జెట్లలో అసలు కేటాయింపే లేదు. తీరా ఇప్పుడు టీటీడీ నిధులను కైవసం చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. అది కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టేవరకూ ఆగకుండా, హడావుడిగా ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు మొన్నటి కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలో ఆర్డినెన్స్‌ను తెచ్చి, ఆ వెంటనే టీటీడీ నుంచి నిధులు రాబట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఉపయోగించే కామన్‌ గుడ్‌ ఫండ్‌(సీజీఎ్‌ఫ)కు ఏటా రూ.40 కోట్లు, ఉద్యోగుల వేతనాలకు ఉద్దేశించిన ఎండోమెంట్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఫండ్‌(ఈఏఎ్‌ఫ)కు రూ.5 కోట్లు, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌కు రూ.5 కోట్లు చొప్పున రూ.50కోట్లు ఇవ్వాలనే విధంగా దేవదాయశాఖ చట్టంలో నిబంధనలను ప్రభుత్వం సవరించనుంది. 

అసెంబ్లీ సమావేశాలు లేనందున ఇప్పుడు దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. దేవదాయశాఖ తన పరిధిలోని ఆలయాల నుంచి వివిధ కాంపోనెంట్ల కింద వాటా వసూలు చేస్తుంది. ఆయా ఆలయాల ఆదాయం నుంచి 9 శాతం సీజీఎఫ్‌, 8 శాతం ఈఏఎఫ్‌, 3శాతం అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌కు తీసుకుంటుంది.

ప్రతిఏటా ఆలయాలు వాటి ఆదాయాన్ని అంచనా వేశాక దేవదాయశాఖకు ఈ నిధులు అందిస్తాయి. అన్ని ఆలయాల తరహాలోనే టీటీడీ కూడా వాటా ఇవ్వాలని దేవదాయశాఖ 1987లో చట్టం చేస్తున్న సమయంలో ప్రతిపాదించింది. అయితే హుండీ ఆదాయాన్ని తాము ఆదాయంగా చూపలేమని, అది చాలా ఎక్కువ అవుతుందని టీటీడీ అభ్యంతరం తెలిపింది. శాతంగా కాకుండా ఫిక్సిడ్‌ మొత్తంగా ఏటా రూ.1.25 కోట్లు ఇస్తామని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని పెంచాలని 2014లో మరోసారి ప్రతిపాదించగా, ఆడిట్‌ విభాగం అంగీకరించడం లేదంటూ టీటీడీ పెంచలేదు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. భారీ ఎత్తున నిధులు ఇవ్వడం సాధ్యం కాదని, కావాలంటే నిబంధనలు సవరించుకోవాలని ప్రభుత్వానికి టీటీడీ సూచించింది. దీంతో దేవదాయశాఖ ఏటా రూ.50కోట్లు ఇచ్చేలా ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ నేరుగా దేవదాయశాఖకు నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రంలోని ఆలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రతిఏటా భారీగానే నిధులు వెచ్చిస్తోంది. అయితే, ఇప్పుడు కచ్చితంగా దేవదాయశాఖకే ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబడుతోంది.

ఇప్పటివరకూ ఉన్న విధానంలో ఆలయాల నుంచి వచ్చే నిధులనే దేవదాయశాఖ ఉద్యోగుల వేతనాలు, ధూపదీప నైవేద్యం పథకం అమలుకు వెచ్చిస్తున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం 2019-20లో రూ.234కోట్లు ధూపదీప నైవేద్యం కోసం నిధులు కేటాయించింది. ఆ నిధులు నేరుగా ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొంది. కానీ, ఇంతవరకూ ఆ నిధులు ఇవ్వలేదు.

ధూపదీప నైవేద్యం కోసం ఏటా ఖర్చు చేస్తున్న రూ.10కోట్లు కూడా సీజీఎఫ్‌ నుంచే వాడుతున్నారు. అసలు ప్రభుత్వం ఇస్తానన్న నగదు ఇస్తే టీటీడీ నుంచి వచ్చే నిధుల కోసం వేచిచూడాల్సిన అవసరం రాదు. కానీ, ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, టీటీడీ నిధులను అందులోకి మళ్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

దేవదాయశాఖ పరిధిలోని పెద్ద ఆలయాలు, టీటీడీ నుంచి నిధులు  రాబడుతున్న ప్రభుత్వం.. మసీదుల్లో ఇమామ్‌, మౌజన్‌, చర్చిల్లో పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం మాత్రం ప్రభుత్వ నిధుల నుంచే ఇస్తోంది. ఇమామ్‌కు నెలకు రూ.10వేలు, మౌజన్‌, పాస్టర్లకు రూ.5వేలు చొప్పున  గౌరవ వేతనాలు ఇస్తున్నారు.

అదే తరహాలోనే తమకూ ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని, ఆలయాలపై ఆధారపడొద్దని అర్చకులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే మసీదులు, చర్చిలు నిర్మించేందుకు ఇస్తున్నట్లుగానే ఆలయాల నిర్మాణానికి కూడా ప్రభుత్వమే నిధులు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు చిన్న ఆలయాల్లో అర్చకుల వేతనాలను అర్చక సంక్షేమ నిధిపై వచ్చే వడ్డీ ద్వారా ఇస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇవ్వట్లేదు.