టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే దళితబంధు… దళితుల ఆందోళన

హుజురాబాద్ లో జరుగనున్న ఉపఎన్నికలలో దళితుల ఓట్లు కైవసం చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ మాత్రమే ప్రవేశపెట్టిన దళితబంధు పధకం అమలు తీరుతెన్నుల పట్ల అక్కడి దళితులలోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలనే దళితబంధు లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారని అంటూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితులు ఆందోళనకు దిగారు.

ప్రభుత్వ ఉద్యోగులు, భూములు, ఆస్తులున్న వారిని అర్హుల జాబితాలో ఎలా చేరుస్తారని మండిపడ్డారు. అనర్హులను దళిత బంధు లబ్ధిదారులుగా ఎలా గుర్తిస్తారని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితులు నిరసనలు చేపట్టారు. మరోవైపు, తమకు కూడా దళితబంధు లాంటి పథకాన్ని ప్రకటించాలని వివిధ సామాజిక వర్గాల వారు డిమాండ్‌ చేస్తున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రారంభించి, 5 వేల మందికి పదేసి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో వివిధ ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. జమ్మికుంట మండలం కోరపల్లిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, భూమి ఉన్నవారిని అర్హులుగా గుర్తించారని దళితులు రోడ్డుపై బైఠాయించారు. వీణవంక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ మండలంలో 351 మంది లబ్ధిదారులు, మండల కేంద్రంలో 35 మందిని ఎంపిక చేయాల్సి ఉంది.

స్థానికేతరుల ఎంపిక 

ఉద్యోగులు, స్థానికేతరులను ఎంపిక చేశారని, ఇల్లు, భూమిలేని నిరుపేదలు, కూలీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆందోళనకారులు తహసీల్దార్‌ను నిలదీశారు. హుజూరాబాద్‌ మండలం కందుగులలో లబ్ధిదారుల ఎంపిక పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పరకాలకు వెళ్లే రోడ్డుపై ధర్నా చేశారు.

గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా ఏడుగురికి మాత్రమే తొలి విడతలో ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారని, ప్రగతి భవన్‌లో జరిగిన సదస్సులో పాల్గొన్న నలుగురిలో ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారని తెలిపారు. ఆబాది జమ్మికుంటకు చెందిన దళితులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ఇక, ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే రాష్ట్రంలోని దళితులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని ఎస్సీ సమ గ్ర అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లో దీక్షలు చేపట్టారు.

సీఎంతో భోజనం చేసినోళ్లకు లేదు

హుజూరాబాద్  మండలం కందుగుల గ్రామంలో అర్హుల జాబితాతో   గ్రామానికి వచ్చిన అధికారిపై అక్కడి దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో ఉన్న కాగితాలను లాగి పారేశారు. ఎనిమిది మందిని మాత్రమే ఎలా ఎంపిక  చేశారని  ప్రశ్నించారు. కేసీఆర్​తో సహపంక్తి భోజనానికి వెళ్లిన వారిలో ఇద్దరి పేర్లు కూడా అందులో లేవని మండిపడ్డారు. 

లాబీయింగ్​ చేసినోళ్ల పేర్లు మాత్రం ఉన్నాయని వారు ఆరోపించారు. నిజమైన పేదోళ్లను విస్మరించి అనుకూలమైన వాళ్లను ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్  జెడ్పీటీసీ బక్కారెడ్డి, ఆయన భార్య, సర్పంచ్​ ప్రభావతిని నిలదీశారు. పరకాల–-హుజూరాబాద్​ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 

అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వక్తం చేస్తూ వీణవంక తహశీల్దార్ ఆఫీస్​ ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. అర్హుల జాబితాలో తమను ఎందుకు చేర్చలేదంటూ జమ్మికుంట తహసీల్దార్​ను  జమ్మికుంట దళితులు నిలదీశారు. ఇదే మండలం కుర్రపల్లిలో స్థానిక దళితులు గ్రామ పంచాయతీ ఆఫీసును ముట్టడించారు.   

రజకులు, సంచార జాతుల నిరసనలు 

వీణవంక మండలం రామకృష్ణాపూర్‌లో రజక మేలుకొలుపు పేరిట సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న హుజూరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా.. రజకబంధు పథకాన్ని ప్రకటించాలని కోరారు. రూ.10 లక్షలు, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

హుజూరాబాద్‌లో సంచార జాతులకు చెందిన వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమకు కూడా దళితబంధులా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉండగా ఈ నెల 16న 5 వేల కుటుంబాలకు రూ.500 కోట్ల మేర సహాయం అందించేందుకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది.

నియోజకవర్గంలో ఉన్న నాలుగో వంతు దళిత కుటుంబాలకు మాత్రమే సహాయం అందనున్న నేపథ్యంలో, అన్ని గ్రామాల్లోనూ ఈ ఎంపిక ప్రక్రియ ఆందోళనకు దారితీసే అవకాశం ఉంది.

దళితబందుకు బేరసారాలు 

మరోవంక, అధికార పక్షానికి చెందిన స్థానిక నేతలు ఈ పధకంలో లబ్ది పొందాలంటే తమకు ముడుపులు చెల్లించాలి అంటూ బేరసారాలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి భర్తతో  అదే గ్రామానికి చెందిన దళిత వ్యక్తి మాట్లాడిన ఫోన్​ఆడియో శుక్రవారం రాత్రి సోషల్​మీడియాలో వైరలైంది.

ఆ ఆడియోలో రంజిత్​అనే వ్యక్తి ఓ ప్రజాప్రతినిధి భర్తతో మాట్లాడారు. ‘దండం పెడుతా.. కాళ్లు మొక్తుత.. సగం పైసలు తీస్కో కానీ నాకు దళితబంధు వచ్చేటట్లు చేయ్’ అంటూ అడిగారు. ప్రజాప్రతినిధి భర్త  సైతం సగం పైసలు నేనెందుకు తీస్కుంటగానీ లక్షో రెండు లక్షలో ఖర్చు అవుతాయ్ అని అన్నారు.

‘దండం పెడ్తా గుంట భూమి లేదు యాస్​ ఫర్​రికార్డు ప్రకారం నాకన్న ఇంకా దళితుడు ఎవ్వరూ ఉండకపోవచ్చు.. ప్లీజ్​ దయచేసి నాకు ఇప్పించు. అటూ ఇటు అని అంత పడ్డంకా నేను ఆడనో ఇడనో మాటిచ్చినంక నాకు ఇయ్యనని అనవు కదా’ అంటూ అవతలి వ్యక్తి అన్నారు. మామ ఫస్టు నువ్ తీసుకున్నంకనే నాకు ఇవ్వు అంటూ మాట్లాడిన సంభాషణ ఈ పధకం అమలు తీరుపై కొత్త చర్చకు తెర తీసింది.