ఎటిఎంల్లో నగదు లేకపోతే బ్యాంకులపై జరిమానా

ఇక ఎటిఎంల్లో నగదు లేకపోతే సంబంధిత బ్యాంకులపై జరిమానా విధించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) సిద్ధమైంది. బ్యాంక్‌ ఖాతాదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 

అక్టోబర్‌ 1 నుండి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఎటిఎంలో నగదు నిల్వ ఐపోయినట్లయితే,  సకాలంలో తిరిగి నింపని సదరు బ్యాంకులపై జరిమానా విధించనున్నట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను విడుదల చేసింది. నెలలో ఓ ఎటిఎం మిషన్‌లో 10 గంటల పాటు నగదు లేని పక్షంలో సంబంధిత బ్యాంకుపై ఆర్‌బిఐ జరిమానా విధిస్తుంది.

కరెన్సీ లేని కారణంగా ఎటిఎం నుండి ఖాతాదారు నగదు ఉపసంహరించుకోలేకపోయిన సమయం నుండి తిరిగి ఆ ఎటిఎంలో నగదు నింపే వరకు నో క్యాష్‌ టైమ్‌గా పరిగణించనుంది. ఒక్కో ఎటిఎంకు రూ. 10 వేలు చొప్పున వసూలు చేయనుంది. బ్యాంకులతో పాటు వైట్‌ లేబుల్‌ ఎటిఎం ఆపరేటర్లకూ కొత్త నిబంధన వర్తించనుంది.

“ఎటిఎం లలో నగదు పంపిణీ చేయనందుకు జరిమానావిధించే ఉద్దేశ్యం ప్రజల జలసౌకర్యార్థం ఈ యంత్రాలలో తగినంతగా  నిధులు అందుబాటులో ఉండేలా చూడడమే” అని సెంట్రల్ బ్యాంక్ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.   

ఏటీఎంలలో నగదు లభ్యత గురించి బ్యాంకులు/వైట్-లేబుల్ ఎటిఎం  ఆపరేటర్లు తమ వ్యవస్థను బలోపేతం చేయాలని,  ప్రజలు ఎలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా మెషీన్‌లో నగదు సకాలంలో జమ అయ్యేలా చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది.