గుజ‌రాత్‌లోని అంక‌లేశ్వ‌ర్‌లో కోవాగ్జిన్ ఉత్ప‌త్తికి గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌లోని భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ కోవిడ్ టీకాల ఉత్ప‌త్తి సంఖ్య‌ను పెంచేందుకు మ‌రిన్ని ఉత్ప‌త్తి కేంద్రాల‌ను ప్రారంభిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్‌లోని అంక‌లేశ్వ‌ర్‌లో కోవాగ్జిన్ ఉత్ప‌త్తికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చ జెండా ఊపిన‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. 

భారత్ కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌.. కోవిడ్ కోసం స్వ‌దేశీయంగా కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి ప‌రిచింది. గ‌తంలో కేవ‌లం హైద‌రాబాద్ యూనిట్ నుంచి మాత్ర‌మే కోవాగ్జిన్ ఉత్ప‌త్తి జ‌రిగేది. ఇక నుంచి అంక‌లేశ్వ‌ర్ యూనిట్ నుంచి కూడా ఉత్ప‌త్తి ప్రారంభించ‌నున్న‌ది. 

జ‌న‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు 7 కోట్ల టీకా డోసుల‌ను భార‌త్‌బ‌యోటెక్ ఉత్ప‌త్తి చేసిన విష‌యం తెలిసిందే. కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిపై కోవాగ్జిన్ టీకా సామ‌ర్థ్యం 77.8 శాతంగా ఉంది. ఇక ఆ టీకాతో డెల్టా వేరియంట్‌పై 65.62 శాతం ర‌క్ష‌ణ ఉన్న‌ట్లు తెలుస్తోంది.