ఉజ్వల యోజన 2.0 ప్రారంభించిన మోదీ

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవైలో భాగంగా ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్ స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. 

ఉజ్వల యోజన-2021ను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ తొలి విడతలో అవకాశం రాని వారిని పరిగణనలోకి తీసుకుని 2.0 స్కీమ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఈ పథకం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మహోబా నుంచి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. మొదటి విడతగా యూపీలోని పేద కుటుంబాలకు 1,47,43,862 ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చారు. ఉజ్వల 2.0 స్కీమ్‌ను 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. 

కాగా, మహోబా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బయోఫ్యూయల్ ఎగ్జిబిషన్‌ను సీఎం ఆదిత్యనాథ్, పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రారంభించారు.  ప్రపంచ బయోఫ్యూయల్ దినోత్సవంగా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఇదే సందర్భంగా ముజఫర్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంప్రెస్సెడ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు.

“ఎల్‌పిజికి సార్వత్రిక ప్రాప్యత ఎనిమిది కోట్ల మందిని పొగరహిత ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి భారతీయ మహిళలను శక్తివంతం చేసింది. #పిఎం ఉజ్వల 2 అదనపు 1 కోటి పేద కుటుంబాల పరివర్తనకు ఆధారం” అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పూరి ట్వీట్ చేశారు.

ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, “ఉత్తర ప్రదేశ్‌లో, ఉజ్జ్వల పథకం మొదటి దశలో కనీసం 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. కోవిడ్ సమయంలో, ప్రధాని మోదీ  లబ్ధిదారులందరికీ ఆరు నెలల పాటు ఉచిత సిలిండర్లను అందించారు.” అని తెలిపారు.
2016 లో ప్రారంభించిన ఉజ్వల 1.0 సమయంలో, దారిద్య్రరేఖకు దిగువన  బీపీఎల్ కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళా సభ్యులకు ఎల్ పి జి కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. 

తదనంతరం, ఈ పథకం 2018 ఏప్రిల్‌లో మరో ఏడు వర్గాల (ఎస్సి/ఎస్టీ, పిఎంఎవై, ఎఎవై,  అత్యంత వెనుకబడిన తరగతులు, టీ తోట, అటవీ నివాసులు, దీవులు) నుండి మహిళా లబ్ధిదారులను చేర్చడానికి విస్తరించారు. గడువుకు ఏడు నెలల ముందే ఆగష్టు, 2019లో ఈ లక్ష్యంకు చేరుకున్నారు. 

ఉజ్వల 2.0 కింద ఈ ఒక కోటి అదనపు కనెక్షన్లు పిఎంయువై మునుపటి దశ కింద కవర్ చేయలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు డిపాజిట్ రహిత ఎల్ పి జి కనెక్షన్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు, ఉజ్వల 2.0 మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్‌ను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తుంది. 

నమోదు ప్రక్రియకు కనీస వ్రాతపని అవసరం. ఉజ్వల 2.0 లో, వలసదారులు రేషన్ కార్డులు లేదా చిరునామా రుజువు సమర్పించాల్సిన అవసరం లేదు. ‘కుటుంబ ప్రకటన’,  ‘చిరునామా రుజువు’ రెండింటికీ స్వీయ ప్రకటన సరిపోతుంది.