తీర ప్రాంత వాణిజ్యం చురుకుగా జరిగితేనే అందరికీ సౌభాగ్యం

తీర ప్రాంత వాణిజ్యం చురుకుగా జరగడంపైనే అందరికీ సౌభాగ్యం చేకూరుతుందని, అందుకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా గ్లోబల్ ఎకానమీకి ముప్పు వాటిల్లుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్టబద్ధమైన తీర ప్రాంత వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలని పిలుపునిచ్చారు. 

”సముద్ర భద్రతను మెరుగుపరచడం” అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎస్ఎస్‌సీ)లో సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి బహిరంగ చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. యూఎస్ఎస్‌సీలో బహిరంగ చర్చకు అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. 

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సముద్ర భద్రత మెరుగుపరచడం, అంతర్జాతీయ సహకారంపై ఉన్నత స్థాయి చర్చ జరిగింది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్ర మార్గాలు ‘లైఫ్‌లైన్’ వంటివని ప్రధాని పేర్కొన్నారు. తీర ప్రాంత వారసత్వాన్ని పంచుకునే విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రస్తావింఛారు. అంతర్జాతీయ చట్టాల ఆధారంగా తీరప్రాంత వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని సూచించారు. తీర ప్రాంత భద్రతా వ్యూహంలో ఇదొక కీలకాంశమని చెప్పారు.

”సముద్రం అనేది ఉమ్మడి వారసత్వం. మన సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి లైఫ్‌లైన్ వంటివి. మన ప్లానెట్ భవిష్యత్తుకు సముద్ర మార్గాలు చాలా కీలకం. తీరప్రాంత వారసత్వాన్ని పంచుకోవడం ఇవాళ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను కూడా చోటుచేసుకుంటున్నాయి” అని  పేర్కొన్నారు.

సహజ ఉత్పాతాలు, సముద్ర భద్రతకు ఎదురవుతున్న ముప్పును అంతర్జాతీయ సమాజం సమష్టిగా ఎదుర్కోవాలని ప్రధాని సూచించారు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ (యూఎన్‌ఎస్‌పీ) సభ్య దేశాలకు చెందిన దేశాధినేతలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.