రాజ్యాంగ హామీల పురోగతిని విశ్లేషించుకోవాలి

భారతదేశం స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏండ్ల మైలురాయిని చేరుకుంటున్న నేపథ్యంలో సామాన్య పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు రాజ్యాంగపరంగా కల్పించిన హామీల పురోగతిని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఏరకమైన వివక్షల్లేని జీవితాన్ని ప్రజలకు అందించేందుకు, ‘గణతంత్రం’ అనే పదానికి ఉన్న అర్థాన్ని సార్థకం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. 
 
కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ సంపాదకత్వంలో వచ్చిన ‘యాక్సలరేటింగ్ ఇండియా : 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ దేశ పౌరులకు అందిస్తున్న సేవల నాణ్యతను పెంచడంతోపాటు సరైన సమయంలో అందేలా చొరవ తీసుకోవాలని చెప్పారు.
 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పథకాల అమలుకోసం చేపడుతున్న ఉత్తమ విధానాలను స్వీకరిస్తూ, మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పద్ధతులను అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు. అట్టడుగు వర్గాలతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అలా జరిగినప్పుడే సమగ్రాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని పేర్కొన్నారు. 
 
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కార్యక్రమం’ సత్పలితాలు సాధించడాన్ని అభినందించారు. యువతకు నైపుణ్యాన్ని అందించడంలో ప్రభుత్వాలకు తోడుగా ప్రైవేటు రంగం కూడా తోడ్పాటునందించాలని పేర్కొన్నారు.
 
నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటుచేయడం ముదావహం అన్న ఉపరాష్ట్రపతి, కార్పొరేట్ సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన మార్గాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మద్దతుగా నిలుస్తుండటం అభినందనీయమని కొనియాడారు.
 
స్వచ్ఛభారత్ పథకం ద్వారా పది కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగడం చక్కటి పరిణామమని, ఈ పథకం ద్వారా కోట్లాది చిన్నారులు అనారోగ్యాల బారిన పడకుండా ఆపగలిగామని వెంకయ్య నాయుడు చెప్పారు. అంతే గాకుండా మహిళలకు తగిన గౌరవాన్ని కల్పించగలిగామని ఆయన తెలిపారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని అభినందిస్తూ  భారతదేశంలోని విద్యావిధానాన్ని సమగ్రంగా, విలువల ఆధారితంగా మార్చడంతోపాటు చక్కటి అభ్యాసనను అందించే దిశగా ఈ విధానం ఎంతగానో ఉపయుక్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తి, టీమిండియా స్ఫూర్తితో పనిచేసినప్పుడే సమగ్ర వికాసం సాధ్యమవుతున్నదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. 28 మంది ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులు, విషయ నిపుణులు రాసిన 25 వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.