రైతులకు కనివిని ఎరుగనంతగా కనీస మద్దతు ధర

ఖరీఫ్, రబీ సీజన్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా కనీస మద్దతు ధరకు రైతుల ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా రూ.1,70,000 కోట్లు రైతుల అకౌంట్లకు నేరుగా చేరిందని, గోధుమ రైతులకు రూ.85,000 కోట్లు బదిలీ  అయ్యాయని చెప్పారు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద 9వ విడతగా రూ.19,500 కోట్లను ప్రధాని విడుదల చేశారు. లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా ఈ  నిధులు జమ అవుతాయి. తద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ ఎగుమతుల విషయంలో ప్రపంచంలోనే టాప్-10 దేశాల్లో తొలిసారి భారత్ చేరిందని తెలిపారు. దేశ వ్యవసాయ విధానాల్లో తొలిసారి చిన్న రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని చెప్పారు.

ప్రధాని ఈ సందర్భగా రైతులతో ముఖాముఖీ మాట్లాడుతూ, తాజాగా విడతగా విడుదల చేసిన సొమ్ము రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ‘కిసాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ పథకం కూడా ఈరోజుతో ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. 

అలాగే జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన మిషన్ హనీ-బీ ద్వారా రూ.7 లక్షల కోట్ల విలువచేసే తేనె ఎగుమతి అవుతుందని, రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి మన వ్యవసాయం, మన రైతుల భూమిక చాలా కీలకంగా మారుతుందని ప్రధాని చెప్పారు.

భారతదేశంలోని వ్యవసాయం నూతన సవాళ్లు ఎదుర్కొని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందేందుకు ఇదే సరైన తరుణమని ప్రధాని చెప్పారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు, డిమాండ్‌కు అనుకుణంగా వ్యవసాయరంగం మార్పులు సంతరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

మహమ్మారి (కోవిడ్) సమయంలోనూ రైతులు రికార్డు స్థాయి ఉత్పత్తులు సాధించారని ప్రశంసించారు. ఎప్పటికప్పుడు రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వెళ్తోందని చెబుతూ  విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు మార్కెట్ యాక్సిస్‌కు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ప్రభుత్వం చూసిందని పేర్కొన్నారు.

యూరియా కొరత లేకుండా చూశామని, అంతర్జాతీయ మార్కెట్‌లో డీఏపీ ధరలు పెరిగినప్పటికీ తక్షణం రూ.12,000 కోట్లు విడుదల చేయడం ద్వారా రైతులకు భారం లేకుండా చేశామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం పప్పుధాన్యాల కొరత ఉన్నప్పుడు ఉత్పత్తులు పెంచాలని తాను రైతులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.

ఫలితంగా గత 6 ఏళ్లలో పప్పుధాన్యాల ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరిగిందని చెప్పారు. వంటనూనెల విషయంలో స్వయంసమృద్ధి సాధిస్తామని జాతీయ ఎడిబుల్ ఆయిల్ మిషన్-ఆయిల్ పామ్ వాగ్దానం చేసిందని తెలిపారు. కుకింగ్ ఆయిల్ ఎకోసిస్టమ్‌లో నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్-ఆయిల్ పామ్ రూ.11,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని ప్రధాని వెల్లడించారు. నాణ్యమైన విత్తనాల దగ్గర నుంచి సాంకేతికత వరకూ రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు.

కాగా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇంతవరకూ రైతుల ఖాతాల్లోకి రూ.1 లక్ష 60 కోట్లు బదిలీ చేశామని, ఇందులో లక్ష కోట్లు చిన్న రైతులకు జమ చేశామని ప్రధాని చెప్పారు. కరోనా కాలంలో 2 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ఫుడ్ పార్కులు, కిసాన్ రైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధి చిన్న రైతులకు సాయపడుతుందని చెప్పారు.