కేరళలో టీకా సర్టిఫికెట్ ఉంటేనే ఎక్కడికైనా ప్రవేశం

కేరళలో కరోనా ఉధృతం పెరుగుతూ ఉండడంతో ఈ నెల 11 నుండి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.  రెండు వారాల్లోపు ఒక డోసు టీకా తీసుకున్న ధ్రువీకరణ పత్రం లేదా 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్‌ నెగిటివ్ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారినే ఇకపై షాపులు, మాల్స్‌, బ్యాంకులు, మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, వివిధ కార్యాలయాల్లో ప్రవేశానికి అనుమతిస్తారు. 

వర్కర్స్‌తోపాటు సందర్శకులకు ఇది అమలవుతుందని ఆ రాష్ట్ర విపత్తు నియంత్రణ నిర్వాహణ అథారిటీ తెలిపింది. దీనిని పక్కగా పాటించేందుకు సిబ్బందిని అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని చెప్పింది. కాగా, కేరళలోని వాణిజ్య సంఘాలు, ప్రతిపక్షాలు ఈ కొత్త నిబంధనను వ్యతిరేకించగా ప్రభుత్వం మాత్రం సమర్థించుకున్నది.

దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ పోతున్నా కేర‌ళ‌లో ప‌రిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్న‌ది. అక్క‌డ రోజూ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశంలో న‌మోదవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల‌లో కేవ‌లం కేరళ రాష్ట్రం నుంచే 40 శాతానికి పైగా కొత్త కేసులు ఉంటున్నాయి.

ఆదివారం కూడా కేర‌ళ‌లో 18,607 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివిటీ రేటు కూడా అంత‌కంత‌కే పెరిగిపోతున్న‌ది. ఇప్పుడు పాజిటివిటీ రేటు 13.87 శాతానికి చేరింది. అయితే, తాజాగా 20,108 మంది బాధితులు వైర‌స్ ప్ర‌భావం నుంచి కోలుకున్నారు. కానీ 93 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.