బోనమెత్తిన గవర్నర్ డాక్టర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను ఆదివారం రాజ్ భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో ఘనంగా  జరిగాయి.గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనం ఎత్తుకొని, గవర్నర్ నివాసం నుండి అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వచ్చి బోనం సమర్పించారు.

గవర్నర్ కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది, రాజ్ భవన్ పరివార్ కు చెందిన మహిళలు గవర్నర్ తో పాటు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం  సమర్పించారు. భారతదేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరింతగా అభివృద్ధి చెందాలని  అమ్మవారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై తెలిపారు.

హైదరాబాద్ సంప్రదాయ పద్ధతిలో బోనాలను ఎత్తుకుని, జాతర తరహా మేళతాళాలతో గవర్నర్ తన నివాసం నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ స్వయంగా బోనం ఎత్తుకొని రావడం, సిబ్బంది ఊరేగింపుగా రావ‌డంతో రాజ్ భ‌వ‌న్‌లో బోనాల పండుగ వేడుక‌గా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ లు భవాని శంకర్, రఘు ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా,  సంప్రదాయ గిరిజన కళలు ఒక గొప్ప వారసత్వసంపద, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. వందల, వేల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాలకు  ప్రతి రూపాలు అయిన ఈ అపురూప కళా సంపదను  కాపాడి, భవిష్యత్ తరాలకు మన చారిత్రక వారసత్వాన్ని అందించాలని గవర్నర్  వివరించారు.

మాదాపూర్ లోని  స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహిస్తున్న  ఎథ్నిక్  ఆర్ట్ ఎగ్జిబిషన్ ను గవర్నర్ సందర్శించారు. గిరిజన సంప్రదాయ కళా వస్తువుల ను పేరుపేరునా కనుక్కొని ఆసక్తిగా పరిశీలించారు.అప్పటి కళానైపుణ్యానికి గవర్నర్ ముగ్ధులయ్యారు.ఇవి గొప్ప వారసత్వ సంపద అని,  వీటిని అపురూపంగా కాపాడుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు.

శాశ్వత ప్రాతిపాదికన ఈ కళాఖండాలను కాపాడుకోవడానికి మ్యూజియం ఏర్పాటు కోసం తనవంతుగా ప్రయత్నిస్తానని డాక్టర్ తమిళి సై   హామీ ఇచ్చారు.ఈ  ఆదివాసి, గిరిజన సంపద అమూల్యమైనది అని వాటిని కాపాడుకోవడానికి కొత్త తరానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని గవర్నర్ చెప్పారు.